ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 రేసులో రవిచంద్రన్ అశ్విన్... జో రూట్‌తో పాటు ఆ ఇద్దరితో...

First Published Dec 28, 2021, 7:04 PM IST

ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 రేసులో భారత జట్టు నుంచి ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఈ ఏడాది భీకరమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌తో పాటు న్యూజిలాండ్ బౌలర్ కేల్ జెమ్మీసన్, శ్రీలంక టెస్టు కెప్టెన్ కరణరత్నేలతో పోటీ పడబోతున్నాడు అశ్విన్...

ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టు నుంచి అటు బాల్‌తో, ఇటు బ్యాటుతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు భారత టెస్టు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...

ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో 8 మ్యాచుల్లో 52 వికెట్లు తీసిన అశ్విన్, బ్యాటుతోనూ రాణించి ఓ సెంచరీతో 337 పరుగులు చేశాడు.. 

చెన్నై టెస్టులో సెంచరీతో సిరీస్‌లో 189 పరుగులు చేసిన అశ్విన్, సిడ్నీ టెస్టులో హనుమ విహారితో కలిసి అద్బుత భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు. 

ఆ మ్యాచ్‌లో 128 బంతుల్లో 29 పరుగులు చేసిన అశ్విన్, స్వదేశంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌లతో జరిగిన టెస్టు సిరీసుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలిచాడు. 

ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో అవకాశం దక్కలేదు. లేదంటే ఈ ఏడాది కచ్ఛితంగా అశ్విన్‌కి ఐసీసీ అవార్డు దక్కి ఉండేదే..

2021 ఏడాదిలో ఆరు సెంచరీలతో టెస్టుల్లో ఏకంగా 1700లకు పైగా సాధించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. ఒక ఏడాదిలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు...

పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ యూసఫ్, విండీస్ దిగ్గజం సర్ వీవిన్ రిచర్డ్స్ మాత్రమే జో రూట్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ ఏడాది 29 ఇన్నింగ్స్‌ల్లో 1708 పరుగులు చేయగా, యూసఫ్ 1788, వీవ్ రిచర్డ్స్ 1710 పరుగులతో టాప్‌లో ఉన్నారు... 

జో రూట్ 1700+ పరుగులు చేస్తే, ఇంగ్లాండ్ జట్టులో ఏ ప్లేయర్ కూడా 600+ పరుగులు కూడా చేయలేకపోయారు.రోరీ బర్న్స్ 530 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. బ్యాటుతోనే కాకుండా బంతితోనూ అద్భుతంగా రాణించి, ఈ ఏడాది 14 వికెట్లు తీసిన జో రూట్... టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 రేసులో ముందంజలో ఉన్నాడు...

న్యూజిలాండ్‌, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కేల్ జెమ్మీసన్. ఈ ఏడాది 5 మ్యాచుల్లో 27 వికెట్లు తీసిన జెమ్మీసన్, బ్యాటుతోనూ రాణించి 105 పరుగులు చేశాడు...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్, రోహిత్ శర్మలను అవుట్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జెమ్మీసన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీని స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చాడు...

శ్రీలంక టెస్టు సారథి దిముత్ కరణరత్నే, ఈ ఏడాది 7 టెస్టుల్లో 69.38 సగటుతో 902 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు కూడా ఉన్నాయి. 

click me!