INDvsENG 1st Test: వర్షంలోనే కొనసాగిన ఆట... రిషబ్ పంత్ అవుట్...

First Published Aug 6, 2021, 5:00 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. వర్షం కారణంగా రెండో రోజు ఆటకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించగా... మూడో రోజు కూడా వరుణుడి రాక ప్లేయర్లను ఇబ్బంది పెట్టింది...

రెండో రోజు అండర్సన్ వేసిన 47వ ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగింది. బ్రేక్ తర్వాత ఓ సారి ఒక బంతి, రెండోసారి రెండు బంతులు మాత్రమే ఆట సాధ్యమైంది...

ఎట్టకేలకు మూడో రోజు తన ఓవర్‌ను పూర్తి చేయగలిగాడు జేమ్స్ అండర్సన్. ఆ ఓవర్ ముగిసిన తర్వాత మళ్లీ అండర్సన్ బౌలింగ్‌కి రాగానే వర్షం మొదలైంది. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది...

తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క బంతి ఆటగానే తిరిగి వర్షం మొదలైంది. అయితే అంపైర్లు మాత్రం ఆటను నిలపకుండా అలాగే కొనసాగించారు. వర్షం పడుతున్నా ఆటను కొనసాగించడంపై భారత సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఆశ్చర్యం వ్యక్తం చేయడం కనిపించింది...

కొద్ది నిమిషాల్లోనే వర్షం ఆగిపోగా... రిషబ్ పంత్ తన స్టైల్‌లో ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. రాబిన్‌సన్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన రిషబ్ పంత్, అదే ఊపులో షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు...

20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. 145 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా...

పంత్ అవుటైన తర్వాత కెఎల్ రాహుల్ అవుట్ కోసం అప్పీల్ చేసినా, అంపైర్ నుంచి స్పందన రాలేదు. 52 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది టీమిండియా. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 30 పరుగులు వెనకబడి ఉంది. 

click me!