ఇటీవల ముగిసిన భారత్-పాక్ మ్యాచ్ లో భాగంగా ఇండియా ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ వేసిన పాకిస్తాన్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ బౌలింగ్ లో నాలుగో బంతి హైట్ నోబాల్ కాగా కోహ్లీ దానిని సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాత బంతికి ఫ్రీహిట్ రాగా.. బంతి వికెట్లను తాకి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లగా కోహ్లీ-కార్తీక్ లు బైస్ రూపంలో మూడు పరుగులు తీశారు.
అయితే ఈ రెండు అంశాలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంపైర్లు భారత్ కు అనుకూలంగా వ్యవహరించారని.. లేకుంటే ఫలితం మరో విధంగా ఉండి ఉండేదని వాపోతున్నారు. అయితే తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ సారథి సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లు ఆట కంటే ముందు ఆటలో నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిదని కౌంటర్ ఇచ్చాడు.
తన యూట్యూబ్ ఛానెల్ లో భట్ మాట్లాడుతూ.. ‘నోబాల్ వివాదం గురించి చెప్పుకుంటే బాల్ బ్యాట్ కు కనెక్ట్ అయ్యే సమయంలో బ్యాటర్ నడుము కంటే ఎత్తులో వచ్చింది. అది నోబాల్. ఆ బంతిని కోహ్లీ సిక్సర్ గా మలిచాడు. అదే వికెట్ పడి ఉంటే నోబాలా..? కాదా..? అనే అంశంపై థర్డ్ అంపైర్ కు వెళ్లొచ్చు. అయితే నవాజ్ బంతి విషయంలో మాత్రం థర్డ్ అంపైర్ కు వెళ్లాల్సిన పన్లేదు.
ఇక ఫ్రీ హిట్ కు వద్దాం. రనౌట్, బంతిని చేతితో ఆపటం.. ఫీల్డింగ్ ను అడ్డుకోవడం, రెండు సార్లు బంతిని కొట్టడం వంటివి జరిగితే ఔట్ గా ప్రకటిస్తారు. ఇవి కాకుండా ఏం జరిగినా ఔట్ కాదు. నవాజ్ వేసిన బంతి వికెట్లను తాకి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. ఈ సమయంలో ఆటగాళ్లకు ప్రజన్స్ ఆఫ్ మైండ్ చాలా ముఖ్యం. అది భారత బ్యాటర్లకు ఉంది గనకే వాళ్లు మూడు పరుగులు తీశారు.
కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు బంతి సంగతి మరిచిపోయి అంపైర్ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లీగ్స్ లో క్రికెట్ ఆడుతున్నారు. వారికి నిబంధనలు తెలిసి ఉండాలి. క్రికెట్ చట్టాల గురించి వాళ్లు తెలుసుకుంటే మంచిది.
పాకిస్తాన్ లో అలీమ్ దార్, హసన్ రాజా వంటి దిగ్గజ అంపైర్లు ఉన్నారు. వారి దగ్గరకు వెళ్లి క్రికెట్ చట్టాలు ఏమేం ఉన్నాయి..? వాటిని ఎలా అమలుపరుస్తారు..? మ్యాచ్ లో వాటిని అన్వయించుకోవడం ఎలా..? అనే విషయాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి..’ అని చెప్పాడు. ఇవి నేర్చుకోకుంటే భవిష్యత్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పాకిస్తాన్ జట్టుకు తిప్పలు తప్పవని హెచ్చరించాడు.
ఈ మ్యాచ్ లో ఓడటంపై అందరూ నోబాల్ వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారే తప్ప పాకిస్తాన్ జట్టు సెలక్షన్ అత్యంత చెత్తగా ఉందన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదని భట్ తెలిపాడు. ‘పాకిస్తాన్ జట్టు టీమ్ సెలక్షన్ విషయంలో మెరుగుపడాలి.
మీరు ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు. అక్కడ ప్రస్తుతం వర్షం, చలి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నాలుగో సీమర్ తో ఆడటం చాలా ముఖ్యం. కానీ ఏ ఒక్కరూ దీని గురించి మాట్లాడటం లేదు..’ అని భట్ చెప్పాడు.