Deepti Sharma, India Women Cricket Team
Deepti Sharma Super Bowling : మహిళల ఆసియా కప్ 2024లో భారత జట్టు తన యాత్రను విజయంతో ప్రారంభించింది. భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది.
భారత చేతిలో పాకిస్తాన్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2024 రెండో మ్యాచ్ దంబుల్లాలో జరిగింది. ప్రారంభం నుంచి మ్యాచ్ ను భారత్ తన చేతుల్లోనే ఉంచుంది. ఏ సమయంలోనూ పాకిస్తాన్ కు ఛాన్స్ ఇవ్వలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను భారత బౌలర్లు 108 పరుగులకే పరిమితం చేశారు. లక్ష్య ఛేదనలో మరో 35 బంతులు మిగిలి ఉండగానే పాక్ పై భారత్ విజయాన్ని అందుకుంది. మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు మొత్తంగా ఇది 12వ విజయం.
Deepti Sharma, India Women Cricket Team
ఆసియాకప్‌లో భారత మహిళల జట్టు, పాకిస్థాన్ మహిళల జట్టు మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ నిదా దార్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే, భారత బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్‌ను పూర్తి 20 ఓవర్లు క్రీజులో నిలవలేకపోయింది. 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ అత్యధికంగా 25 పరుగులు చేయగా, తూబా హసన్ 22, ఫాతిమా హసన్ 22 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. మిగతా ప్లేయర్లు రెండంకెల స్కోర్ ను అందుకోలేకపోయారు.
భారత్ తరఫున దీప్తి శర్మ మరోసారి సూపర్ బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేశారు. మూడు వికెట్లు తీసుకుని పాకిస్తాన్ ను దెబ్బకొట్టారు. ఆమెకు తోడుగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్ లు రెండేసి వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ నాలుగు ఓవర్ల తన బౌలింగ్ లో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చారు. అయితే, ఒక ఓవర్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ముగ్గురిని ఔట్ చేశారు. దీంతో 20 ఓవర్లు పూర్తి కాకముందే పాకిస్తాన్ ఇన్నింగ్స్ కు ఎండింగ్ పడింది.
పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో తన చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు దీప్తి శర్మ. తొలి బంతికి టుబా హాసన్ ను ఔట్ చేశారు. రెండో బంతిని సయ్యదా అరూబ్ ఆడగా పరులులేమీ రాలేదు. మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి సయ్యదా ఔట్ అయ్యారు. ఐదో బంతికి నష్రా సంధు క్యాచ్ రూపంలో రిచా ఘోష్ కు దొరికిపోయారు. ఆరో బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసుకోవడంతో దీప్తి శర్మ మొత్తంగా 250 వికెట్లను పూర్తి చేశారు.