Deepti Sharma, India Women Cricket Team
India women vs Pakistan Women : మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
శ్రీలంకలోని దంబుల్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. షెఫాలీ వర్మ, స్మృతి మంధానలు ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. హాఫ్ సెంచరీలను కోల్పోయారు కానీ, భారత్ కు మంచి విజయాన్ని అందించారు.
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 85 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మంధాన 31 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసింది. ఆమె పదో ఓవర్లో సయ్యదా అరుబ్ షా బౌలింగ్ లో ఔట్ అయింది. 29 బంతుల్లో 40 పరుగులు చేసిన షెఫాలీని 12వ ఓవర్‌లో సయ్యదా బౌల్డ్ చేశారు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది షెఫాలీ.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 5 పరుగులతో, జెమిమా రోడ్రిగ్స్ 3 పరుగులతో నాటౌట్‌గా భారత్ ను విజయం వైపు నడిపించారు. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. పాక్ ప్లేయర్లలో సిద్రా అమీన్ 35 బంతుల్లో మూడు ఫోర్లతో 25 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు.
Deepti Sharma
భారత్ అద్భుతమైన బౌలింగ్ ముందు పాక్ టీమ్ లోని ఏడుగురు ప్లేయర్లు రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టును దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్ తో దెబ్బకొట్టారు. కీలకమైన పాక్ కెప్టెన్ నిదా దార్, తుబా హసన్, నష్రా సంధుల వికెట్లను తీసుకున్నారు. ఓకే ఓవర్ లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.
దీప్తి శర్మకు తోడుగా మిగతా బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేయడంతో పాకిస్తాన్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీసుకున్నారు. అలాగే, రేణుకా సింగ్ 2, పూజా వస్త్రాకర్ 2, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. సూపర్ బౌలింగ్ వేసిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. కాగా, ఈ టోర్నీలో భారత్ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో రెండో మ్యాచ్ ఆడనుంది.