Virat Kohli
పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్, భావి క్రికెటర్లకు ‘భగవద్గీత’తో సమానం అంటూ విశ్లేషించాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్. ఆస్ట్రేలియాతో పాటు పాక్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి పొరుగు దేశాల క్రికెటర్లు కూడా విరాట్ ఇన్నింగ్స్‌ని వేనోళ్ల పొగిడారు...
Virat Kohli-Suryakumar Yadav
అయితే గౌతమ్ గంభీర్ మాత్రం విరాట్ కోహ్లీని మెచ్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. ఏదో మొహమాటానికి కోహ్లీ బాగా ఆడాడని కామెంట్ చేసిన గంభీర్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విరాట్, రోహిత్ శర్మల కంటే సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌కే క్రెడిట్ ఇచ్చాడు...
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్... ఇలా టాప్ బ్యాటర్లు అందరూ విఫలమైనా సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 40 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లతో 68 పరుగులు చేసి అదరగొట్టాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 20+ పరుగులు చేయలేని మ్యాచ్‌లో సూర్య ఒక్కటే హాఫ్ సెంచరీతో భారత జట్టుకి ఓ మోస్తరు స్కోరు అందించగలిగారు...
‘నా దృష్టిలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ కంటే సౌతాఫ్రికాపై సూర్యకుమార్ యాదవ్ ఆడింది ది బెస్ట్ టీ20 ఇన్నింగ్స్... ఇంతకంటే గొప్ప టీ20 ఇన్నింగ్స్‌ని ఇప్పటిదాకా నేనైతే చూడలేదు...
Image credit: Getty
ఎందుకంటే వరుసగా వికెట్లు పడ్డాయి. పిచ్ బ్యాటింగ్ చేయడానికి కూడా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ ఎంతో ఈజీగా బౌండరీలు బాదాడు, హాఫ్ సెంచరీ చేశాడు... అందులో ఇది బెస్ట్ ఇన్నింగ్స్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...
అయితే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వరుసగా వికెట్లు పడ్డాయి. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాని విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆదుకుని జట్టుకి విజయాన్ని అందించాడు...
సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్సే కాదనలేం. అయితే దాన్ని పొగడడం కోసం విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ని తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం ఏముందని గౌతమ్ గంభీర్‌ని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. పాత గొడవలు మనసులో పెట్టుకుని, క్రికెట్‌ని విశ్లేషించడం మానుకుంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు..