యజ్వేంద్ర చాహాల్ vs వానిందు హసరంగ... పర్పుల్ క్యాప్ విజేత ఎవరో తేలిపోనుందా...

First Published May 27, 2022, 5:03 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ యజ్వేంద్ర చాహాల్. 8 సీజన్ల పాటు ఆర్‌సీబీలో కీలక ప్లేయర్‌గా ఉన్న చాహాల్‌ని రిటైన్ చేసుకోని ఆర్‌సీబీ, మెగా వేలంలో తిరిగి కొనుగోలు చేయడానికి కూడా పెద్దగా ప్రయత్నించలేదు...

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.6 కోట్ల 50 లక్షలకు యజ్వేంద్ర చాహాల్‌ని కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత రెట్టింపు పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నాడు యజ్వేంద్ర చాహాల్...
 

ఐపీఎల్‌ కెరీర్‌లో ఆర్‌సీబీ తరుపున దాదాపు 140 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్ కోసం రూ.7 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధపడని ఆ ఫ్రాంఛైజీ, లంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగని రూ.10 కోట్ల 75 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేయడం విశేషం...

ఆల్‌రౌండర్‌గా ఆర్‌సీబీలోకి వచ్చిన హసరంగ బ్యాటుతో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయినా ఫీల్డర్‌గా మాత్రం అదరగొడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హసరంగ తన ఫీల్డింగ్ విన్యాసాలతో దాదాపు 20 పరుగులను కాపాడాడు...

Chahal

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే రెండో క్వాలిఫైయర్ ఓ రకంగా ఐపీఎల్ 2022 సీజన్ పర్పుల్ క్యాప్ విజేతను తేల్చనుంది.. పర్పుల్ క్యాప్ రేసులో చాహాల్ టాప్‌లో ఉంటే, హసరంగ అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు..

లక్నో ఎలిమినేటర్ మ్యాచ్ నుంచే ఎలిమినేట్ కావడంతో ఐపీఎల్ 2022 సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా జోస్ బట్లర్ ఖరారు అయిపోయాడు. అతనికి కెఎల్ రాహుల్‌కి మధ్య 102 పరుగుల వ్యత్యాసం ఉండగా, మూడో స్థానంలో ఉన్న క్వింటర్ డి కాక్ 210 పరుగుల దూరంలో ఉన్నాడు.

15 మ్యాచుల్లో 17.77 సగటుతో 26 వికెట్లు తీశాడు యజ్వేంద్ర చాహాల్. వానిందు హసరంగ 15 మ్యాచుల్లో 16.16 సగటుతో 25 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరూ కూడా ఈ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు, మరో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం విశేషం...
 

Chahal-Sanju Samson

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో 32 పరుగులిచ్చిన యజ్వేంద్ర చాహాల్ వికెట్లేమీ తీయలేకపోయాడు. లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హసరంగ 4 ఓవర్లలో 42 పరుగులిచ్చి దీపక్ హుడా వికెట్ తీశాడు...

రెండో క్వాలిఫైయర్‌లో యజ్వేంద్ర చాహాల్, వానిందు హసరంగ తీసే వికెట్లు మాత్రమే కాకుండా మ్యాచ్ రిజల్ట్ కూడా పర్పుల్ క్యాప్ విజేతను తేల్చనుంది. యజ్వేంద్ర చాహాల్, హసరంగ కంటే ఎక్కువ వికెట్లు తీసి, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కి వెళితే... ఇక మనోడే పర్పుల్ క్యాప్ విజేతగా మారతాడు...

Wanindu Hasaranga RCB

లేదా హసరంగ, చాహాల్‌ని అధిగమించి, ఆర్‌సీబీ ఫైనల్‌కి చేరితే లంక ఆల్‌రౌండర్‌కి పర్పుల్ క్యాప్ ఖాతాలో చేరుతుంది. అలాకాకుండా చాహాల్ ఎక్కువ వికెట్లు తీసి, ఆర్‌సీబీ ఫైనల్‌కి చేరితే పర్పుల్ క్యాప్ గెలిచేందుకు హసరంగకు ఫైనల్ మ్యాచ్‌లోనూ ప్రయత్నించే అవకాశం దొరుకుతుంది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయి, ఆర్‌సీబీ రిటెన్షన్‌లోనూ చోటు కోల్పోయిన యజ్వేంద్ర చాహాల్, ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు...

ఆర్థిక మాంద్యంతో తన దేశం అతలాకుతలం అవుతున్న సమయంలో రూ.10.75 కోట్ల భారీ ధర చెల్లించి, తన కష్టాలను తీర్చిన ఆర్‌సీబీ రుణాన్ని పర్పుల్ క్యాప్ గెలిచి తీర్చుకోవాలని చూస్తున్నాడు హసరంగ... ఈ ఇద్దరిలో విజేత ఎవరో నేటి మ్యాచ్‌తో 60 శాతం తేలిపోనుంది.

click me!