ఇదే మొదటిది కాదు.. నాలుగోసారి సెమీస్ ఓడిన న్యూజిలాండ్.. ఐసీసీ టోర్నీలలో పాక్ అంటే హడల్..

First Published | Nov 9, 2022, 6:50 PM IST

T20 World Cup 2022:  టీ20 ప్రపంచకప్ లో ఒక సెమీస్ ముగిసింది.  సిడ్నీ వేదికగా ముగిసిన  పాకిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లో  కివీస్ జట్టును చిత్తుగా ఓడించిన బాబర్ సేన.. ఫైనల్స్ కు దూసుకెళ్లింది. 
 

కొన్ని దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు లార్జర్ దెన్ లైఫ్ గా ఉంటాయి. నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతూ.. ఆడే ఆటగాళ్లతో పాటు చూసే ప్రేక్షకులు కూడా ఒత్తిడితో చిత్తయ్యే విధంగా  మ్యాచులు సాగుతాయి. ఇందులో ప్రథమ స్థానంలో ఉండేది ఇండియా-పాకిస్తాన్.  ఇరుగు పొరుగు దేశాలు కావడం, సరిహద్దు సమస్యలు, భావోద్వేగాలు, ఇతరత్రా విషయాలన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. 

ద్వైపాక్షిక సిరీస్ ల  సంగతి పక్కనబెడితే  ఐసీసీ టోర్నీలలో అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే  స్టేడియాలు నిండాల్సిందే. అయితే ఈ టోర్నీలో  పాక్ పై భారత్ కు ఉన్న సెంటిమెంట్ ప్రకారం  ఇండియానే ఎక్కువ విజయాలు సాధించింది. అయితే మనకు పాకిస్తాన్ మీద విజయాలు ఎలా ఉన్నాయో  న్యూజిలాండ్ మీద ఓటములు అంతే దారుణంగా ఉంటాయి. ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ తో మ్యాచ్ అంటే భారత అభిమానులు వణికిపోతారు. 


అటువంటి న్యూజిలాండ్ కు ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ అంటే హడల్. మిగతా టోర్నీల సంగతి ఎలా ఉన్నా ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో పాక్-న్యూజిలాండ్ లు ఇప్పటివరకు ఏడు సార్లు తలపడితే పాకిస్తాన్ ఐదు గెలవగా న్యూజిలాండ్ రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. 

ఐసీసీ టోర్నీలలో గ్రూప్ దశలో గాక సెమీఫైనల్స్ లో కూడా పాకిస్తాన్.. న్యూజిలాండ్ ను మట్టికరిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా మూడుసార్లు న్యూజిలాండ్.. పాక్ చేతిలో చిత్తై  నిరాశగా టోర్నీ నుంచి వెనుదిరిగింది. వాటి గురించి ఒకసారి చూస్తే.. వన్డే ప్రపంచకప్ 1992,  1999లో న్యూజిలాండ్ కు పాక్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికొస్తే.. 2007తో పాటు 2022లో కూడా సెమీస్ లోనే   న్యూజిలాండ్ కు షాకులు తగిలాయి. 

1992 వన్డే ప్రపంచకప్ (ఆస్ట్రేలియాలోనే జరిగింది) లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. లక్ష్యాన్ని పాకిస్తనా్.. 49 ఓవర్లలో ఛేదించింది. 1999 లో కూడా న్యూజిలాండ్  50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. షోయభ్ అక్తర్ 3 వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని పాకిస్తాన్.. 47.3 ఓవర్లలో ఛేదించింది. సయీద్ అన్వర్ (113) సెంచరీ చేశాడు. 

2007 టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసింది. ఉమర్ గుల్ మూడు వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని పాకిస్తాన్.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి  ఛేదించింది. ఇమ్రాన్ నజీర్ (59) రాణించాడు. 

ఇక తాజాగా 2022 టీ20 ప్రపంచకప్ లో బుధవారం ముగసిన మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్..  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్యాన్ని పాక్.. 19.1 ఓవర్లలోనే  పూర్తి చేసి విజయాన్ని అందుకుంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే  ఐసీసీ టోర్నీలలో మనకు న్యూజిలాండ్ ఎలా అడ్డుకట్ట వేస్తున్నదో.. ఆ జట్టుకు పాకిస్తాన్ అలాగే షాకులిస్తున్నదన్న విషయం అవగతమవుతుంది.

Latest Videos

click me!