రెండంకెల స్కోరు చేయలేనోడితో హాఫ్ సెంచరీ.. పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ ఫిక్స్‌కు అనుమానాలు..?

First Published | Nov 9, 2022, 5:46 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో  భాగంగా పాకిస్తాన్ - న్యూజిలాండ్ మధ్య ముగిసిన  సెమీస్ లో దాయాది దేశం ఘన విజయాన్ని అందుకుని ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఫైనల్ చేరిన విధానంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య ముగిసిన   సెమీస్  ఫిక్స్ అయిందా..? సెమీస్ కు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లేకపోవడంతో పాటు వర్షం కారణంగా ఈ టోర్నీలో మ్యాచ్ లు రద్దవడంతో  నిర్వాహకుల (ఐసీసీ)  పై వస్తున్న విమర్శలతో మరోసారి భారత్-పాక్ ఫైనల్ పెట్టాలనే  ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా న్యూజిలాండ్ - పాకిస్తాన్ మ్యాచ్ కూడా అందుకు సజీవ సాక్ష్యమని  నెటిజన్లు వాపోతున్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పడానికి   కావాల్సినన్ని కారణాలున్నాయని  కామెంట్స్ చేస్తున్నారు. అందులో  బాబర్ ఆజమ్ ప్రదర్శన కూడా ఒకటి. 


ఆసియా కప్   నుంచి ఫామ్ కోల్పోయిన బాబర్ ఆజమ్.. పెద్దగా రాణించింది లేదు. వరుసగా విమర్శల పాలవుతున్న బాబర్.. ఈ టోర్నీలో కూడా  విఫలమయ్యాడు. భారత్ తో  మ్యాచ్ లో  డకౌట్ అయిన బాబర్.. తర్వాత జింబాబ్వే, నెదర్లాండ్స్ పై  కలిపి 8 పరుగులు చేశాడు. 

ఆ తర్వాత సౌతాఫ్రికాతో కూడా ఆరు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ వరకూ డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. ఆ మ్యాచ్ లో మాత్రం ముక్కీ మూలిగి 25 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఐదు మ్యాచ్ లలో 31 పరుగులు చేయని బాబర్.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 42 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో ఏడు బౌండరీలు కూడా ఉన్నాయి. 

ఈ మ్యాచ్ కు ముందు  కివీస్ ఆడిన ఆటకు నేటి ఆటకు పోలికే లేదు.  ఈ టోర్నీ ప్రారంభంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తో పాటు తర్వాత ఆడిన   గేమ్స్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేసిన కివీస్.. గ్రూప్-1లో టాపర్ గా నిలిచింది. కానీ సెమీస్ లో ఆ జట్టు ఆట మరీ తీసికట్టుగా ఉంది.  ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, డెవాన్ కాన్వేల వైఫల్యం.. కేన్ మామ టెస్టు ఆట..  వీటితో పాటు బౌలింగ్ కు సహకరించని పిచ్ పై కూడా చెలరేగే టిమ్ సౌథీ,  ట్రెంట్ బౌల్ట్ లు నేడు దారుణంగా విఫలమయ్యారు. ఇది కూడా పలు అనుమానాలకు తావిస్తున్నదని నెటిజన్లు వాపోతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యాన్ని  పాకిస్తాన్.. 19.1  ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  మహ్మద్ రిజ్వాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలలో పాకిస్తాన్ కు ఇది మూడో ఫైనల్ కావడం గమనార్హం. గతంలో 2007, 2009లో  పాకిస్తాన్ ఫైనల్ కు చేరింది. 2009 తర్వాత ఫైనల్స్ కు చేరడం పాక్ కు ఇదే తొలిసారి.  ఇదిలాఉండగా 2015, 2019లో వన్డే ప్రపంచకప్ లో ఫైనల్స్, గతేడాది  టీ20 ప్రపంచకప్ లో ఆసీస్ చేతిలో  తుది పోరులో ఓడిన కివీస్ కు ఇది మరో కోలుకోలేని షాక్. ఐసీసీ టోర్నీ కోసం ఆ జట్టు ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలో..? 

Latest Videos

click me!