ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయి...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీకి ఒక్క పరుగు తేడాతో విజయం దక్కిన విషయం తెలిసిందే...
విజయం సాధించకపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ చూపించిన తెగువ, క్రికెట్ అభిమానులతో పాటు విమర్శకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా హెట్మయర్‌తో కలిసి ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆఖరి బంతిదాకా విజయం కోసం పోరాడిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా ద్వారా స్పందించిన టీమిండియా కోచ్ రవిశాస్త్రి... ‘బ్రిలియంట్ గేమ్... చూస్తుంటే ఈ ఏడాది కొత్త విజేత కోసం మొలకలు వస్తున్నట్టుగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు...
ఎవరు గెలుస్తారనే విషయం ప్రస్తావించకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేదా ఢిల్లీ క్యాపిటల్స్ జట్లలో ఏదో ఒకటి టైటిల్ గెలుస్తుందని రవిశాస్త్రి అంచనా వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైంది...
అయితే ఈ ట్వీట్‌పై సీఎస్‌కే ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌లో దారుణమైన వైఫల్యం తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది చెన్నై సూపర్ కింగ్స్...
మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, అద్భుతమైన రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సీఎస్‌కేను ప్లేఆప్ చేరకుండా అడ్డుకోవడం అసాధ్యమే...
ఐపీఎల్ 2020 సీజన్‌లో పూర్ పర్ఫామెన్స్ కారణంగా తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్... ఈ సారి టైటిల్ గెలిచి వాటిని స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతున్నారని ఆశిస్తున్నారు అభిమానులు...