దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా భయాందోళనలకు గురైన ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై అర్ధాంతరంగా స్వదేశానికి బయలుదేరారు. అయితే ఆస్ట్రేలియా, భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించడంతో వీరికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆండ్రూ టై... దోహా చేరి అక్కడి నుంచి స్వదేశానికి చేరుకోగా... ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ మాత్రం మూడు రోజులుగా ముంబై ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయాయి. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో బయో బబుల్ దాటి, బయటికి వెళ్లి ఇబ్బందులు పడడం కంటే, ఇక్కడ ఉండడమే చాలా క్షేమం. అయితే ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి నిర్ణయాన్ని తప్పుబట్టడానికి లేదు...
ఆడమ్ జంపా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధమవ్వడం చూసి నేను షాక్ అయ్యాను. జంపా నిర్ణయం తర్వాత కేన్ రిచర్డ్‌సన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడు.
వారిద్దరితో నేను మాట్లాడాను. వారికి భయం కంటే కూడా అవసరం ఎక్కువగా ఉందని చెప్పారు. ఆస్ట్రేలియా ఉన్న వారి కుటుంబీకులు కంగారు పడుతుండడంతో తప్పక వెళ్తున్నామని చెప్పారు.
వారి నిర్ణయాలను గౌరవించాలి. నా వరకూ బయో బబుల్ చాలా సేఫ్‌గా అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి వెళ్లాలనే ఆలోచన మాత్రం చేయడం లేదు. అది చాలా రిస్క్ కూడా’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై ఇండియన్స్ ప్లేయర్ నాథన్ కౌంటర్‌నైల్.
ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి ఐదు మ్యాచుల్లో అవకాశం దక్కించుకోని కౌంటర్‌నైల్... రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు.
మరోవైపు కరోనా భయంలో స్వదేశానికి వెళ్లాలని భావించిన ఆసీస్ అంపైర్ పౌల్ రిఫైల్... ఆఖరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఐపీఎల్ ముగిసేదాకా బయో బబుల్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.