టెస్టు మ్యాచ్ అంటే ఇది... పాక్‌పై కివీస్ ఉత్కంఠ విజయం... టెస్టుల్లో నెం.1 టీమ్‌గా న్యూజిలాండ్...

టెస్టు మ్యాచ్ అంటే ఐదురోజుల పాటు సాగాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న టెస్టులు అత్యధికం నాలుగు రోజుల్లోనే ముగుస్తున్నాయి. కొన్నయితే పూర్తిగా మూడు రోజలు కూడా సాగడం లేదు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా, రెండో టెస్టు మూడున్నర రోజులు సాగింది. అయితే న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు ఐదు రోజుల పాటు పూర్తిగా సాగి... సంప్రదాయ టెస్టు క్రికెట్ మజాని నేటి తరానికి అందించింది.

టెస్టుల్లో వరుసగా ఐదో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొట్టమొదటిసారి నెం.1 ర్యాంకును అధిరోహించనుంది.
ఈ ఏడాది ఐదు టెస్టులు ఆడిన న్యూజిలాండ్... ఐదింట్లోనూ అద్భుత విజయాలు అందుకుంది. ఏడాది మొదట్లో న్యూజిలాండ్‌పై రెండు, వెస్టిండీస్ రెండు టెస్టుల్లో గెలిచిన కివీస్, పాక్‌పై తొలి టెస్టులో విజయాన్ని అందుకుంది.

కేన్ విలియంసన్ సారథ్యంలో సంచలన విజయాలు నమోదు చేసిన న్యూజిలాండ్... టెస్టు చరిత్రలోనే తొలిసారి టాప్ ర్యాంకుకు చేరింది.
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో 101 పరుగులతో విజయం సాధించింది న్యూజిలాండ్.
మొదటి ఇన్నింగ్స్‌లో కేన్ విలియంసన్ అద్భుత సెంచరీతో ఆదుకోవడంతో 431 పరుగులకి ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్. రాస్ టేలర్ 70, హెడ్రీ నికోలసన్ 56, వాట్లింగ్ 73 పరుగులతో రాణించారు.
ఆ తర్వాత పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 239 పరుగులు చేసింది. 80 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును వికెట్ కీపర్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్ కలిసి ఆదుకున్నారు.
రిజ్వాన్ 71 పరుగులు చేయగా, ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ 91 పరుగుల వద్ద అవుటై సెంచరీ మిస్ చేసుకున్నాడు...
రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది న్యూజిలాండ్. పాకిస్థాన్ జట్టు ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది...
75 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును రిజ్వాన్, ఫవాద్ అలామ్ కలిసి అద్భుత పోరాటంతో ఆదుకునే ప్రయత్నం చేశారు.
388 బంతుల పాటు వికెట్ పడకుండా అడ్డుగోడగా నిలబడి... మ్యాచ్ డ్రాగా ముగించేందుకు విశ్వప్రయత్నం చేశాడు రిజ్వాన్, ఫవాద్...
ఐదో వికెట్‌కి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రిజ్వాన్ అవుట్ అయ్యాడు. రిజ్వాన్ 191 బంతుల్లో 60 పరుగులు చేయగా ఫవాద్ అలాం 269 బంతుల్లో 102 పరుగులు చేశాడు.
2009 జూలైలో మొదటి టెస్టు సెంచరీ చేసిన ఫవాద్ అలాంకి ఇది రెండో టెస్టు సెంచరీ. 11 ఏళ్ల తర్వాత రెండో సెంచరీ అందుకున్నాడు ఫవాద్...
రిజ్వాన్ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. 31 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది...
9వ వికెట్ పడిన తర్వాత 8 ఓవర్ల పాటు వికెట్ పడకుండా పోరాడారు పాక్ బ్యాట్స్‌మెన్. అయితే మ్యాచ్ ముగిసేందుకు 5 ఓవర్లు ఉండగా... కివీస్ బౌలర్లకు ఆఖరి వికెట్ దక్కింది...
ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి అరగంట వరకూ ఓటమిని అంగీకరించకుండా పాక్ పోరాడిన తీరు కూడా ప్రశంసనీయమైనదే...
మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆదుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది...

Latest Videos

click me!