సిక్సర్లు కొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య.. అలాంటప్పుడు సింగిల్స్ తీయడమెందుకు దండగ..?

First Published Oct 10, 2022, 12:02 PM IST

IND vs SA ODI: ఇండియా -దక్షిణాఫ్రికా మధ్య  రాంచీ వేదికగా ముగిసిన రెండో వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సఫారీలు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. 

టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడటంలో దిట్ట. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ ఇషాన్.. రోహిత్ శర్మతో కలిసి  ఆ జట్టుకు శుభారంభాలు అందించాడు. నాణ్యమైన పేసర్లతో పాటు  స్పిన్నర్ల బౌలింగ్ లో కూడా అవలీలగా సిక్సర్లు బాదగలిగే సత్తా ఉన్న ఇషాన్.. తనకు సింగిల్స్ తీయడం కంటే  సిక్స్ లు కొట్టడమే ఈజీ అని అంటున్నాడు. 

Image credit: PTI

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా ముగిసిన రెండో వన్డేలో సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్య ఛేదనలో తక్కువ స్కోరుకే ఓపెనర్లు శిఖర్ ధావన్ (13), శుభమన్ గిల్ (28) నిష్క్రమించడంతో  శ్రేయస్ అయ్యర్  (113 నాటౌట్) కలిసి ఇషాన్ కిషన్ (93) మూడో వికెట్ కు 161 పరుగులు జోడించాడు. 

7 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన ఇషాన్ మ్యాచ్ అనంతరం స్పందిస్తూ.. ‘కొంతమంది ఆటగాళ్లు వికెట్ల మధ్య స్ట్రైక్ రొటేట్ చేస్తారు. కానీ నేను అలా కాదు. నా బలం సిక్సర్లు బాదడం. చాలా మంది  ఇబ్బందిపడే పని నాకు చాలా సులువు.  నేను సిక్సర్లు కొట్టడంలో సఫలమవుతున్నప్పుడు మళ్లీ సింగిల్స్ తీయడం దేనికి..?

మీ బలాన్ని బట్టి ముందుకెళ్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అయితే ఈ ఫార్ములా ప్రతీసారి వర్కవుట్ కాదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నప్పుడు  క్రీజులోకి వచ్చి సిక్సర్లు కొడతామంటే కుదరదు. అప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలి.  వికెట్ల మధ్య పరుగెత్తాలి. 

నేటి మ్యాచ్ లో నేను మరో 7 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడినే.  కానీ సెంచరీ కోసం చూసుకుని ఉంటే నేను జట్టుకు అన్యాయం చేసినవాడిని అవుతాను. అది నా స్వార్థం కోసం అవుతుంది. నా దేశం తరఫున ఆడుతూ  వ్యక్తిగత స్కోరు మీద దృష్టి  పెట్టడం సరికాదు. అది మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా వంచించినట్టే..’ అని తెలిపాడు. 

రాంచీ వన్డేలో ఇషాన్.. 84 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 బౌండరీలు, 7 సిక్సర్లున్నాయి. 90లలోకి వచ్చి సెంచరీ మిస్ చేయడం ఇషాన్ కు ఇదేం కొత్తకాదు. ఐపీఎల్ 2020లో కూడా ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ముంబై బ్యాటర్.. 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తాజాగా మరో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

ఇక తమను ‘బీ టీమ్’ గా పరిగణించడంపై  ఇషాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘దక్షిణాఫ్రికాతో ఆడుతున్న మమ్మల్ని చాలా మంది బీ టీమ్ అని పిలుస్తున్నారు. అలా పిలవడం మాకు నిరాశగా ఉంది. తొలి మ్యాచ్ లో మేం ఓడిన తర్వాత ఈ కామెంట్లు ఇంకా ఎక్కువయ్యాయి.  అందుకే మేం ఈరోజు ఏ టీమ్ గేమ్ ఆడాం..’ అని  అన్నాడు. 

click me!