గబ్బర్‌ టైం అయిపోయినట్టేనా! శిఖర్ ధావన్ మళ్లీ ఫెయిల్... ఇలా అయితే వరల్డ్ కప్ ఆడడం కష్టమే..

First Published Oct 9, 2022, 6:56 PM IST

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఒకప్పుడు పరుగులు చేయడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీపడ్డాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాకి కీలక ప్లేయర్‌గా ఉన్న శిఖర్ ధావన్, ఇప్పుడు వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఇప్పుడు అతని ఫామ్ చూస్తుంటే... వన్డేల్లో కూడా ధావన్ చోటుపై అనుమానాలు రేగుతున్నాయి...

కెఎల్ రాహుల్‌తో పాటు యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ కూడా నిలకడైన ప్రదర్శన చూపిస్తూ సెలక్టర్లను ఆకట్టుకుంటున్నాడు. వీరితో పాటు దేశవాళీ టోర్నీల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్న పృథ్వీ షా... టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్నాడు...

ఇలాంటి సమయంలో శిఖర్ ధావన్, కనీసం వన్డేల్లో అయినా టీమిండియాలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే నిలకడైన పర్ఫామెన్స్ చూపించడం చాలా అవసరం. అయితే ధావన్ మాత్రం తనకి వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోవడంలో విఫలమవుతున్నాడు...

Shikhar Dhawan

జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌కి ముందుగా శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. అయితే ఆ తర్వాత కెఎల్ రాహుల్‌కి ప్రాక్టీస్ అవసరమని భావించి, కెప్టెన్‌గా జింబాబ్వే టూర్‌కి ప్రకటించింది. శిఖర్ ధావన్ లాంటి అపారమైన అనుభవం ఉన్న ప్లేయర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి అవమానించారు సెలక్టర్లు...

ధావన్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ ఉండి ఉంటే... సెలక్టర్లు ఇంతటి సాహసం చేసేవాళ్లు కాదు. ఈ ఇద్దరితో సమానమైన టాలెంట్ ఉన్నా, ఐపీఎల్‌లో నిలకడైన పర్ఫామెన్స్ చూపిస్తున్నా... టీమిండియా తరుపున మాత్రం ఆ రేంజ్ ఇన్నింగ్స్‌లను రిపీట్ చేయలేకపోతున్నాడు గబ్బర్...

Image credit: Getty

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు చేశాడు శిఖర్ ధావన్. అయితే అదే మ్యాచ్‌లో 72 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ ఇంప్రెషన్ అంతా కొట్టేశాడు. గిల్ ఇన్నింగ్స్ కారణంగా గబ్బర్ చేసిన పరుగులను ఎవ్వరూ పట్టించుకోలేదు...

రెండో వన్డేలో స్పీడ్ పెంచి 21 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసి అవుటైన శిఖర్ ధావన్, మూడో వన్డేలో 68 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ధావన్ నుంచి టీమిండియా ఆశించిన పర్ఫామెన్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు..

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో 16 బంతుల్లో 4 పరుగులు చేసి అవుటైన శిఖర్ ధావన్, రెండో వన్డేలో 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ కావడం అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తోంది...

Image Credit: Getty Images

టీ20 ఫార్మాట్‌కి దూరమైన శిఖర్ ధావన్, నాలుగేళ్ల క్రితం ఆఖరి టెస్టు ఆడాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కలలు కంటున్న శిఖర్ ధావన్, ఇలాంటి పర్ఫామెన్స్‌నే రిపీట్ చేస్తే మాత్రం... ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడం కష్టమే. ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకుని మునుపటిలా ‘గబ్బర్’ షో చూపించాలని కోరుకుంటున్నారు అభిమానులు.. 

click me!