ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ నుంచి ముగ్గురు... టీ20 వరల్డ్ కప్‌‌లో ఆ రెండు జట్ల ప్లేయర్లకి దక్కని చోటు...

First Published Sep 19, 2022, 10:33 AM IST

ఐపీఎల్ వచ్చిన తర్వాత టీ20 వరల్డ్ కప్ దగ్గర్నుంచి ద్వైపాక్షిక సిరీస్‌ల దాకి అన్ని టోర్నీలకు ప్రకటించే జట్లను ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల లెక్కన విభజించి చూడడం ఎక్కువైంది. ఇంతకుముందు ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది ప్లేయర్లు ఎంపికయ్యారని చూసేవాళ్లు, ఇప్పుడు ఏ ఐపీఎల్ టీమ్ నుంచి ఎంత మంది ఎంపికయ్యారని చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపికైన జట్టు విషయంలోనూ ఇది మినహాయింపు కాదు...

Mumbai Indians

టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ఈ టీమ్ నుంచి ముగ్గురు ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్... టీ20 వరల్డ్ కప్‌కి ఎంపికయ్యారు. టీమిండియాకి కీ ప్లేయర్లుగా మారిన ఈ ముగ్గురూ తుదిజట్టులో చోటు దక్కించుకోవడం కూడా పక్కా...

ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఆర్‌సీబీ నుంచి కూడా ముగ్గురు ప్లేయర్లకు టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కింది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్...ఆర్‌సీబీ నుంచి వరల్డ్ కప్ ఆడబోతున్నారు. వీరిలో విరాట్ కోహ్లీకి తుదిజట్టులో చోటు దక్కడం పక్కా. దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ ఎన్ని మ్యాచులు ఆడతారనేది చెప్పడం కష్టం...

ఐపీఎల్ 2022 రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ఇద్దరు ప్లేయర్లకు టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కింది. స్పిన్నర్లు యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్.. ఆస్ట్రేలియా పొట్టి ప్రపంచకప్‌ ఆడబోతున్నారు. వీరిలో చాహాల్ దాదాపు అన్ని మ్యాచులు ఆడొచ్చు. అశ్విన్‌కి ఒకటి లేదా రెండు మ్యాచుల్లో అవకాశం దక్కొచ్చని అంచనా...

లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కూడా ఇద్దరు ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపికయ్యారు. టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి పొట్టి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. కెఎల్ రాహుల్ ప్రతీ మ్యాచ్ ఆడడం పక్కా అయితే దీపక్ హుడా ఎన్ని మ్యాచులు ఆడతాడో చెప్పడం కష్టమే...

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ప్లేయర్లకు టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో ప్లేస్ దక్కింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, ఆస్ట్రేలియాకి పయనం కానున్నారు. అయితే ఈ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్‌లో ఎన్ని మ్యాచులు ఆడతారనేది అంచనా వేయడం కూడా కష్టమే...
 

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్ నుంచి ఒకే ఒక్క టీ20 వరల్డ్ కప్ 2022 ఆడబోతున్నాడు... అది కూడా టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యానే. టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిన హార్ధిక్ పాండ్యా... పసికూనలతో జరిగే మ్యాచుల్లో మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో ఆడొచ్చు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నుంచి భువనేశ్వర్ కుమార్, పంజాబ్ కింగ్స్ టీమ్ నుంచి అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపికయ్యారు. ఆరెంజ్ ఆర్మీ నుంచి రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లను ఆడించాలని డిమాండ్ వినిపించినా సెలక్టర్లు పట్టించుకోలేదు...

ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతీ టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు తప్పనిసరిగా ఉండేవాళ్లు. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత కూడా రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడారు. అయితే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఒక్క ప్లేయర్‌కి కూడా టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కలేదు. దీపక్ చాహార్ మాత్రమే స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు దక్కించుకోగలిగాడు...

రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్, 2021 సీజన్ రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నుంచి కూడా ఈసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఎవ్వరూ ఆడడం లేదు. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు దక్కింది. 

click me!