Mumbai Indians : హార్దిక్ పాండ్యా కథ క్లోజ్.. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ గా తెలుగు కుర్రాడు

Published : May 03, 2026, 08:10 PM IST

Mumbai Indians Captain: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై వేటు పడే అవకాశం ఉంది. రోహిత్ శర్మ శిష్యుడు, తెలుగు యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు దక్కనున్నట్లు సమాచారం.

PREV
15
హార్దిక్ పాండ్యాకు చెక్.. రోహిత్ ప్లాన్ ఇదేనా

ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. ఒకప్పుడు ముంబై పేరు చెబితేనే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. కానీ, ఐపీఎల్ 2026లో సీన్ రివర్స్ అయింది.

చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర పరాజయం తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు అవుట్ అయింది. ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై మేనేజ్‌మెంట్, ఇప్పుడు కెప్టెన్సీ మార్పుపై సీరియస్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 23 ఏళ్ల యువ సంచలనం, తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీమ్ పగ్గాలు అప్పగించే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

25
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఫ్లాప్.. వేటు తప్పదా?

2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. టీమ్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ ధరకు ట్రేడ్ చేసుకుని మరీ హార్దిక్‌కు బాధ్యతలు ఇచ్చారు. కానీ, ఈ నిర్ణయం ముంబై కొంపముంచింది.

హార్దిక్ కెప్టెన్సీలో జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. అటు ప్లేయర్ గా, ఇటు కెప్టెన్ గా హార్దిక్ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అభిమానుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే సీజన్ నాటికి హార్దిక్ నుంచి కెప్టెన్సీని వెనక్కి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

35
రోహిత్, సూర్య రేసులో లేరా?

ఒకవేళ హార్దిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, ఆ ప్లేస్ ఎవరికి ఇస్తారనేది పెద్ద ప్రశ్న. రేసులో టీ20 వరల్డ్ కప్ విన్నర్ సూర్యకుమార్ యాదవ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. అయితే, సూర్య ఈ సీజన్‌లో ఫామ్‌లో లేకపోవడం పెద్ద మైనస్.

ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే, ఆయన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు రోహిత్ సుముఖంగా లేడని టాక్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక యంగ్ ప్లేయర్‌ను కెప్టెన్‌గా తయారు చేయాలని ముంబై మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే అందరి కళ్లు తిలక్ వర్మపై పడ్డాయి.

45
తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ లాంగ్ రేస్ గుర్రం

తిలక్ వర్మ వయస్సు కేవలం 23 ఏళ్లు మాత్రమే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ తరపున, అటు టీమ్ ఇండియా తరపున తన సత్తా చాటాడు. ఒత్తిడిలో కూడా కూల్‌గా ఆడుతూ టీమ్‌ను ఆదుకోవడం తిలక్ స్పెషాలిటీ. తిలక్‌ను కెప్టెన్ చేయడం వల్ల ముంబైకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. అతనికి రోహిత్ శర్మతో మంచి బాండింగ్ ఉంది. రోహిత్ మార్గదర్శకత్వంలో తిలక్ మంచి కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది. యంగ్ బ్లడ్‌కు కెప్టెన్సీ ఇస్తే టీమ్ ఎనర్జీ కూడా మారుతుందని మేనేజ్‌మెంట్ లెక్కలు వేస్తోంది.

55
ముంబై మేనేజ్‌మెంట్ మాస్టర్ ప్లాన్

ఐపీఎల్ 2026 ప్రదర్శన ముంబై టీమ్ పరువు తీసింది. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. దీంతో భారీ మార్పులు అనివార్యం. తిలక్ వర్మను కెప్టెన్ చేస్తే లోకల్ అభిమానుల సపోర్ట్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. హార్దిక్ పాండ్యాపై వస్తున్న నెగెటివిటీని తగ్గించాలన్నా, జట్టును మళ్లీ విజయాల బాట పట్టించాలన్నా తిలక్ వర్మ ఒక్కడే సరైన ఆప్షన్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వచ్చే సీజన్లో ముంబై కొత్త కెప్టెన్ తిలక్ వర్మ అవుతాడో లేదో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories