MS Dhoni: ధోని మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స

First Published Jun 2, 2023, 9:36 AM IST

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్  సారథి మహేంద్ర సింగ్ ధోని మోకాలికి విజయవంతంగా శస్త్ర చికత్స జరిగిందని  సీఎస్కే వర్గాలు తెలిపాయి. 

ఐపీఎల్  లో చెన్నై సూపర్ కింగ్స్‌కు  ఐదు టైటిల్స్ అందించిన ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని మోకాలికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని సీఎస్కే వర్గాలు తెలిపాయి.  ఐపీఎల్  - 16 లో మోకాలి నొప్పి వేధించినా ధోని  అన్ని మ్యాచ్ లూ ఆడాడు.  

ఇటీవలే  అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ ముగిసిన తర్వాత  ధోని మోకాలికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు.  ఫైనల్ ముగిసిన 48 గంటల తర్వాత ధోని ముంబైలోకి కోకిలాబెన్ ఆస్పత్రిలో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు.  బీసీసీఐ మెడికల్ ప్యానెల్ మెంబర్ దిన్షా పర్దీవాలా  నేతృత్వంలో ధోనికి   సర్జరీ జరిగింది. 

టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్  కు సర్జరీ నిర్వహించిన  పర్దీవాలానే ధోనికి కూడా  ఆపరేషన్ చేశారని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో విశ్వనాథన్ తెలిపారు. ధోనికి సర్జరీ విజయవంతంగా ముగిసిందని..  అతడు ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాడని  చెప్పారు. ధోని  పూర్తిస్థాయిలో కోలుకోవడానికి  రెండు నెలల సమయం పట్టొచ్చని  వెల్లడించారు. 

ఐపీఎల్-16 లో ధోని గాయంతోనే అన్ని మ్యాచ్ లూ ఆడాడు. వికెట్ కీపింగ్ చేసేప్పుడు పెద్దగా ఇబ్బందిపడకపోయినా  బ్యాటింగ్ చేసేప్పుడు  కాస్త ఇబ్బందిపడ్డాడు. గతంలో మాదిరిగా   వికెట్ల మధ్య వేగంగా  పరుగెత్తలేకపోయాడు. మోకాలికి ప్రత్యేకమైన పట్టి కట్టుకుని మరీ  ఐపీఎల్ మొత్తం ఆడటం గమనార్హం. 

కాగా ధోని రిటైర్మెంట్ పై కూడా ఇటీవల కాలంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో  వచ్చే సీజన్ లో అతడు ఆడతాడా..? లేదా..? అన్నది కూడా అతడు పూర్తిగా కోలుకున్న తర్వాతే తేలనుంది. ధోని  సర్జరీ నుంచి కోలుకోవడానికి  2 నెలల సమయం ఉండటంతో ఆ తర్వాత ఫిట్నెస్, శరీరం సహకరించే దానిపై ధోని ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉంది. 

పూర్తిగా కోలుకున్న తర్వాతే ధోని.. ఐపీఎల్ - 2024 లో ఆడాలా..? లేదా..? అన్నదానిపై  తుది నిర్ణయం తీసుకుంటాడని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ వెల్లడించారు.  మోకాలి సర్జరీ నుంచి కోలుకుని మునపటి మాదిరిగా ఫిట్నెస్ సాధిస్తే ధోని  వచ్చే సీజన్  లో  గ్రౌండ్ లో కనిపించే అవకాశాలుంటాయి.  లేదంటే  మెంటార్ గానో మరో రూపంలోనో  ధోనిని చూడటమే..!

click me!