మరో ప్రపంచ రికార్డును తుడిపేసిన కోహ్లీ.. ఇక మిగిలింది ఆ నలుగురే..

First Published Jan 15, 2023, 4:14 PM IST

INDvsSL Live: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో  ప్రపంచ రికార్డును తుడిచేశాడు. గతేడాది ఆసియా కప్ లో ఫామ్ అందుకున్న మళ్లీ చాలా కాలం తర్వాత రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు.

టీమిండియా అభిమానులు రన్ మిషీన్  గా  పిలుచుకునే  విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో మరో రికార్డు బద్దలుకొట్టాడు. శ్రీలంక బ్యాటర్ మహేళ జయవర్దెనే  పేరిట ఉన్న రికార్డును తుడిపేసి ఇప్పటికే తన పేరిట లెక్కకు మిక్కిలి అవార్డులు లిఖించుకున్న  కోహ్లీ.. తాజాగా వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన  క్రికెటర్ల జాబితాలో  ఐదో స్థానానికి చేరాడు.  

ఈ మ్యాచ్ కు ముందు   కోహ్లీ.. వన్డేలలో అత్యధిక పరుగులు చేసినవారిలో   ఆరో స్థానంలో నిలిచాడు.  తన కెరీర్ లో 267 మ్యాచ్ లు ఆడి  258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగులు సాధించాడు.   ఈ క్రమంలో అతడి సగటు  57.47గా ఉంది.  

కోహ్లీ కంటే ముందు మహేళ జయవర్దెనే.. 448 వన్డేలు ఆడి  418 ఇన్నింగ్స్ లలో 12,650 పరుగులు సాధించాడు.    ఇప్పుడు ఈ రికార్డును  కోహ్లీ బ్రేక్ చేశాడు.  శ్రీలంకతో   ప్రస్తుతం తిరువనంతపురం వేదికగా జరుగుతున్న  మూడో వన్డేలో భాగంగా కరుణరత్నే వేసిన  34వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదడం ద్వారా అతడి స్కోరు 65 పరుగులకు చేరింది.  తద్వారా   కోహ్లీ.. జయవర్దెనేను దాటేశాడు.  

అంతర్జాతీయ క్రికెట్ (వన్డేలు) లో  అత్యధిక పరుగుల వీరుల జాబితాను ఓసారి చూస్తే.. భారత క్రికెట్ దేవుడు  సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్ లు ఆడి 18,426 పరుగులు చేశాడు.   ఈ క్రమంలో సచిన్ 49 సెంచరీలు బాదాడు.  అత్యధిక స్కోరు 200 నాటౌట్ గా ఉంది. 

టెండూల్కర్ తర్వాత  లంక వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగక్కర.. 404 మ్యాచ్ లలో 14,326 రన్స్ చేశాడు.  మూడో స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్.. 375 మ్యాచ్ లలో 13,704 పరుగులు చేశాడు.   నాలుగో స్థానంలో లంక మాజీ సారథి సనత్ జయసూర్య.. 445 మ్యాచ్ లలో 13,430 రన్స్ తో ఉన్నాడు.  ఐదో స్థానంలోకి కోహ్లీ చేరాడు. 

click me!