ఆఖర్లో వచ్చి, విజయాన్ని అందించి... మహ్మద్ షమీ రాకతో టీమిండియా బౌలింగ్ కష్టాలు తీరినట్టేనా...

First Published | Oct 17, 2022, 1:55 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది టీమిండియా. 187 పరుగుల లక్ష్యఛేదనలో ఒకనొక దశలో 180/6 స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా, ఈజీగా మ్యాచ్‌ గెలిచేలా కనిపించింది. అయితే ఆఖరి రెండు ఓవర్లలో నడిచిన హై డ్రామా... భారత జట్టుకి విజయాన్ని కట్టబెట్టింది...

ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని మహ్మద్ షమీకి ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. మొదటి 19 ఓవర్లలో భువీ, అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా, హర్షల్ పటేల్, అశ్విన్‌లను వాడిన రోహిత్ శర్మ... ఇన్నింగ్స్‌ చివరి ఓవర్ వేసేందుకు మహ్మద్ షమీని తీసుకొచ్చాడు...

ఆస్ట్రేలియా విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు హర్షల్ పటేల్. ఆ తర్వాతి బంతికి బుల్లెట్ త్రోతో టిమ్ డేవిడ్‌ని పెవిలియన్ చేర్చాడు విరాట్ కోహ్లీ. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడడంతో ఆసీస్ బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడారు...


Image credit: Getty

మిగిలిన నాలుగు బంతుల్లో 5 పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్... కొన్నాళ్లుగా టీమిండియాని వేధిస్తున్న 19వ ఓవర్ కష్టాన్ని తీర్చాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో చూపించిన పర్ఫామెన్స్, అసలు మ్యాచుల్లో చూపిస్తాడా? లేదా? అనేది ఇంకో వారం ఆగితే తేలిపోతుంది. ఆఖరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి...

Mohammed Shami

షమీ వేసిన ఆఖరి ఓవర్‌లో ప్యాట్ కమ్మిన్స్ తొలి రెండు బంతుల్లో నాలుగు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి భారీ సిక్సర్‌కి ప్రయత్నించిన కమ్మిన్స్, బౌండరీ లైన్ దగ్గర విరాట్ కోహ్లీ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికి అస్టన్ అగర్ రనౌట్ కావడం... చివరి రెండు బంతుల్లో జోష్ ఇంగ్లీష్‌ని, కేన్ రిచర్డ్‌సన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ...

Mohammed Shami

జస్ప్రిత్ బుమ్రా గాయపడి, జట్టుకి దూరమైనప్పటి నుంచి ఇలాంటి బౌలింగ్ పర్ఫామెన్స్‌ భారత బౌలర్ల నుంచి రాలేదు. భువీ ఒకటి రెండు మ్యాచుల్లో మెరుపులు మెరిపించినా నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. అపారమైన అనుభవం ఉన్న మహ్మద్ షమీ రాకతో భారత బౌలింగ్ కష్టాలు తీరిపోయాయా? అనేది తేలాలంటే ఇంకో వారం ఆగాల్సిందే...

Image credit: Getty

స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా లేని లోటు తీర్చినా తీర్చకపోయినా మూడు ఫార్మాట్లు ఆడిన అనుభవం ఉన్న షమీ ఎంట్రీతో భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, ఆసియా కప్ 2022 కంటే బెటర్‌గానే కనిపిస్తోంది...  అయితే అసలు మ్యాచుల్లో వీళ్లు ఎలా రాణిస్తారనేదే అసలైన పాయింట్.. 

Latest Videos

click me!