అది 1960, జనవరి. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకి వచ్చింది. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట సాగుతోంది. భారత జట్టు మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి తెగ కష్టబడుతోంది. అబ్బాస్ ఆలీ బైగ్ క్రీజులో ఉన్నాడు. అప్పటికి ఇంకా చదువు పూర్తి చేయని అబ్బాస్ ఆలీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాచ్ గురించే వచ్చాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన అబ్బాస్ ఆలీ, ఐదో రోజు రామ్‌నాథ్ కెన్నీతో కలిసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీ విరామానికి భారత జట్టు మంచి పొజిషన్‌లో నిలబడింది. పెవిలియన్‌కి వస్తున్న సమయంలో నార్త్ స్టాండ్ నుంచి క్రీజులోకి వచ్చిన ఓ అమ్మాయి, అబ్బాస్ ఆలీ బుగ్గపై ముద్దు పెట్టి, వెంటనే వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది...
ఈ హఠాత్ సంఘటనతో అబ్బాస్ ఆలీ బైగ్‌తో పాటు స్టేడియంలో ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు. ఆలీకి ముద్దు పెట్టి వస్తానని తన స్నేహితురాళ్లతో బెట్ కట్టిన ఆ అమ్మాయి, ఆ బెట్ గెలిచింది. అబ్బాస్ ఆలీ మాత్రం మ్యాచ్ చూడడానికి వచ్చిన తన తల్లిదండ్రులు ఏమనుకుంటారోనని తెగ కంగారుపడ్డాడట...
‘నేను చదువుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత చెడిపోయానని వాళ్లు అనుకుంటారేమో..’ అని కామెంట్ చేయగానే స్టేడియంలో అందరూ పగలబడి నవ్వేశారు. అయితే ఈ డ్రామా అక్కడితో ముగియలేదు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ సీనియర్ క్రికెటర్, అబ్బాస్ ఆలీని కలిశాడు...
‘నిన్ను కిస్ చేయాలని వీళ్లంతా వచ్చారు..’ అంటూ నలుగురు అమ్మాయిలను చూపించాడు ఆ క్రికెటర్. పబ్లిక్‌లో అంత మంది చూస్తుంటగా అమ్మాయితో ముద్దు పెట్టించుకున్న అబ్బాస్ ఆలీ, ఈ అమ్మాయిల కోరికను ఎలా కాదనగలనని కామెంట్ చేశాడు. ఆలీ చేసిన కామెంట్లు... అప్పట్లో పటాసుల్లా పేలాయి. మనోడికి ఒక్కసారిగా అమ్మాయిల్లో బీభత్సమైన పాపులారిటీ వచ్చేసింది...
ఆ సంఘటన తర్వాత అబ్బాస్ ఆలీ బైగ్‌కి వేల లెటర్లు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు అమ్మాయిలు పంపిన లవ్ లెటర్లే. ఇది జరిగిన 15 ఏళ్లకు 1975లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడింది భారత జట్టు. భారత బ్యాటర్ బ్రిజేష్ పటేల్, 50 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మ్యాచ్ జరుగుతుండగానే నల్ల చీర కట్టుకున్న ఓ మహిళ, పోలీసుల కళ్లు గప్పి క్రీజులోపలికి వచ్చి నేరుగా బ్రిజేష్ పటేల్ దగ్గరికి వెళ్లి అతన్ని ముద్దు పెట్టి పరుగెత్తింది... ఈ సంఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులంతా అరిచి గోల చేశారు...
ఈ రెండు సంఘటనలను ఆదర్శంగా తీసుకున్న డైరెక్టర్ మహేశ్ మథాయ్, క్యాడ్‌బెరీ డైరీ మిల్క్ యాడ్‌ని రూపొందించాడు. ఈ యాడ్‌లో మోడల్ సిమోన రాశి, సిక్సర్ కొట్టిన తన బాయ్‌ఫ్రెండ్‌కి డ్యాన్స్ చేస్తూ వచ్చి ముద్దు పెడుతుంది. డైరీ మిల్క్ చాక్లెట్‌కి బీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చింది ఈ యాడ్...