దేశవాళీలో అత్యుత్తమ ప్రదర్శనలు, ఐపీఎల్ లో మెరుపులతో టీమిండియాలోకి చోటు దక్కించుకున్న యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో అతడికి టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కలేదు.
వాస్తవానికి అయ్యర్ ను ముందు ఎంపిక చేసిన జట్టులో స్టాండ్ బై ప్లేయర్ గా తీసుకున్నారు. కానీ ఆస్ట్రేలియాకు తొలి దశలో వెళ్లిన భారత జట్టుతో అయ్యర్ వెళ్లలేదు. అదే సమయానికి అతడు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడాడు. ఈ సిరీస్ లో ఓ సెంచరీతో పాటు నిలకడగా ఆడిన అయ్యర్.. తర్వాత ఆస్ట్రేలియా వెళ్తాడని అంతా భావించారు.
అయితే ప్రస్తుతానికి టీమిండియా బ్యాటింగ్ బలంగానే ఉందని.. స్టాండ్ బై ప్లేయర్ గా అయ్యర్ అవసరం ఏమీ లేదని జట్టు మేనేజ్మెంట్ భావించింది. దీంతో అయ్యర్ ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటమెందుకుని.. అతడు దేశవాళీలో మళ్లీ బరిలోకి దిగాలని చూస్తున్నాడు.
ఇండియాలో జరుగుతున్న సయీద్ ముస్తాక్ అలీ టీ20 (స్మాట్) - 2022లో బరిలోకి దిగనున్నాడు. తన స్వంత జట్టు ముంబై తరఫున అయ్యర్ ఆడనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకున్నాడు. జట్టులో 16వ అనధికారిక ఆటగాడిగా అయ్యర్ కొనసాగనున్నాడు.
అయ్యర్ కంటే ముందు శార్దూల్ ఠాకూర్ ముంబై తరఫున ఎంపికయ్యాడు. కానీ అతడు దీపక్ చాహర్ కు రిప్లేస్మెంట్ గా ఆసీస్ వెళ్లిన నేపథ్యంలో ముంబై జట్టులో అతడి స్థానాన్ని సూర్యాన్ష్ హెగ్డేను ఎంపిక చేసింది. ఇప్పుడు హెగ్డేను పక్కనబెట్టి అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నది. ఇదే జరిగితే శ్రేయాస్.. ఈనెల 20న రాజస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడతాడు.
ఇక ముంబై సారథి అజింక్యా రహానే కూడా ఈ మ్యాచ్ తో తిరిగి జట్టుతో చేరునున్నాడు. ఈ సీజన్ లో ముంబైకి కెప్టెన్ గానే బరిలోకి దిగినా అతడు గాయంతో గత రెండు మ్యాచ్ లు ఆడలేదు. దీంతో అతడి స్థానాన్ని పృథ్వీ షా భర్తీ చేశాడు. తదుపరి మ్యాచ్ నుంచి అయ్యర్, రహానే ఇద్దరు తుది జట్టుతో కలిసే అవకాశముంది.