ఆసియా కప్ గెలిచిన జోష్‌లో టీ20 వరల్డ్‌కప్‌కి... మహేళ జయవర్థనేని దించుతున్న శ్రీలంక...

First Published Oct 9, 2022, 3:30 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు సంగతి. ఈసారి ఆసియా కప్ గెలిచే జట్టు ఏది? అంటూ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, అభిమానుల అభిప్రాయాన్ని అడిగింది. అందులో టీమిండియాకి మెజారిటీ ఓట్లు పడగా పాకిస్తాన్‌కి 22 శాతం, ఆఖరికి ఆఫ్ఘాన్‌కి కూడా 9 శాతం ఓట్లు పడ్డాయి. ఐదు సార్లు టైటిల్ గెలిచిన శ్రీలంకకి మాత్రం 1 శాతం ఓట్లు కూడా రాలేదు..

ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీని ఆరంభించింది శ్రీలంక. దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత సరైన విజయాలు అందుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న లంక, టీమిండియా, పాకిస్తాన్‌, ఆఫ్ఘాన్‌లను ఓడంచి టైటిల్ నెగ్గడం అసాధ్యమని భావించారంతా...

Image credit: Getty

అందరూ అనుకున్నట్టుగానే మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది శ్రీలంక. అయితే ఆ తర్వాత లంక ఆటతీరులో మార్పు వచ్చింది. ‘లంకలో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు లేరని’ బంగ్లా కోచ్ ఏ నిమిషాన కామెంట్ చేశాడో కానీ శ్రీలంక టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మిగిలిన టీమ్‌లకు చుక్కలు చూపించింది...

asia cup

బంగ్లాదేశ్‌ని ఓడించి సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించిన శ్రీలంక, టీమిండియా, పాకిస్తాన్, ఆఫ్ఘాన్‌లను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఆరో సారి ఆసియా కప్ టైటిల్‌ని కైవసం చేసుకుంది...

ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలో నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్ వంటి జట్లతో తలబడనుంది శ్రీలంక జట్టు. గత సీజన్‌లో క్వాలిఫైయర్స్‌ స్టేజీలో మంచి పర్ఫామెన్స్ చూపించినా సూపర్ 12 రౌండ్‌లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న లంక, ఈసారి అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కన్సల్టెంట్ కోచ్‌గా లంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనేని నియమించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఇంతకుముందు ఇంగ్లాండ్ జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన జయవర్థనే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి కోచ్‌గా మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు. 

click me!