ఇలాంటి చెత్త పిచ్‌పైన ఐపీఎల్ మ్యాచులు ఆడాలా?... కెఎల్ రాహుల్, లక్నో సూపర్ జెయింట్స్‌కి కొత్త కష్టాలు...

First Published Jan 30, 2023, 10:19 AM IST

టీ20 మ్యాచ్ అంటే బౌండరీల బాదుడు, సిక్సర్ల మోతతో ఆడేవాళ్లకు ఊపు, చూసేవాళ్లకు ఓ కొత్త ఉత్సాహం రావాలి. అయితే లక్నో వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ చూసినవాళ్లకు ఉత్సాహం కాదు కదా,నీరసం వచ్చేసింది... ఒకే ఇన్నింగ్స్‌లో 200+ స్కోరు కొట్టేసే ఈరోజుల్లో రెండు టీమ్స్‌ కలిసి 40 ఓవర్లు (ఒక్క బాల్ తక్కువ) ఆడి 200 కొట్టాయి..,

Image credit: PTI

న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 99 పరుగులు చేసినప్పుడు ఈ లక్ష్యాన్ని టీమిండియా, సరిగ్గా 10 ఓవర్లలో ఊది పడేస్తుందని అనుకున్నారు అభిమానులు. అయితే అలా జరగలేదు. 100 పరుగుల టార్గెట్‌ని కొట్టడానికి ముక్కుతూ ములుగుతూ 19.5 ఓవర్లు తీసుకుంది టీమిండియా...

సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, హార్ధిక్ పాండ్యా వంటి భారీ హిట్లరు ఉన్న జట్టు, 100 పరుగులు చేయడానికి ఇంత ఇబ్బంది పడిందంటే పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

ఇండియాలో జరిగిన టీ20 మ్యాచ్‌లో మొట్టమొదటి సారి ఇరుజట్లు కూడా ఒక్క సిక్స్ కూడా లేకుండా మ్యాచ్‌ని ముగించడం ఇదే తొలిసారి. అయితే ఈ మ్యాచ్ రిజల్ట్, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ని తీవ్రంగా కలవరబెడుతోంది...
 

Image credit: PTI

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, అంచనాలకు మించి రాణించి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. అయితే మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతుల్లో ఓడింది లక్నో...

Image Credit: PTI

‘ఇది ఏ మాత్రం టీ20 క్రికెట్ పిచ్ కాదు. ఇలాంటి పిచ్‌ని క్వింటన్ డి కాక్‌ చూస్తే, అతను ఐపీఎల్‌ ఆడడానికి ఇష్టపడడు. అసలు అతను ఇండియాకే రాడు. అయితే ఈ పిచ్‌పై అమిత్ మిశ్రా అదరగొడతాడు. రవిభిష్ణోయ్ కూడా మ్యాజిక్ చేస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు లక్నోసూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హోం గ్రౌండ్‌గా ఉండనుంది ఈ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌బాయ్ ఏకనా క్రికెట్ స్టేడియం. ఇలాంటి పిచ్‌పై ఆడితే కెఎల్ రాహుల్, తన ఫెవరెట్ ఆరెంజ్ క్యాప్ గెలవడం చాలా కష్టం...
 

Image credit: PTI

‘ఈ వికెట్ చాలా షాక్‌కి గురి చేసింది. ఇప్పటిదాకా ఆడిన రెండు పిచ్‌లు కూడా చాలా క్లిష్టమైనవి. ఇలాంటి పిచ్‌లపై ఆడడం మంచిదే, టీమ్‌ని ఇలాంటి పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో నేర్పించినట్టు అవుతుంది.

అయితే ఇవి టీ20 మ్యాచులకు సెట్ అయ్యే పిచ్‌లు కావు. క్యూరేటర్, పిచ్ తయారుచేసే సమయంలో ఈ విషయాలను కాస్త గుర్తుంచుకోవాలి...’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

హోం, అవే వెన్యూ విధానంలో ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచులు జరగబోతున్నాయి. దీంతో లక్నో టీమ్, 7 మ్యాచులు ఇదే వేదికపై ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి పిచ్‌పై మ్యాచులు ఇదే విధంగా జరిగితే ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు...

click me!