మూడేళ్లలో ఇద్దరే మిగిలారు... 2019 వన్డే వరల్డ్ కప్‌ నుంచి 2022 టీ20 వరల్డ్‌ కప్‌కి...

First Published Oct 16, 2022, 10:34 AM IST

నిన్న మొన్నే 2022 న్యూఇయర్ వచ్చిన్నట్టు ఉంది, అప్పుడే అక్టోబర్‌ నెల వచ్చేసి, అందులో సగం రోజులు కూడా అయిపోయాయి. 2019 వన్డే వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ అయిన సీన్ ఇప్పటికే ఫ్రెష్‌గా క్రికెట్ ఫ్యాన్స్‌ మదిలో నిలిచిపోయింది. మూడేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్‌కి, 2022 టీ20 వరల్డ్ కప్‌కి మధ్య అన్ని జట్లలో చాలా మార్పులు జరిగాయి..

 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 16 నుంచి క్వాలిఫైయర్స్ రౌండ్స్‌ జరగనున్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్‌కి ముందు 16 జట్ల కెప్టెన్లతో ఫోటోషూట్ నిర్వహించింది ఐసీసీ. కరోనా నిబంధనల కారణంగా 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఈ ఫోటోషూట్ జరగలేదు...

తాజాగా ఫోటో షూట్‌తో 2019 వన్డే వరల్డ్ కప్‌ ఫోటోషూట్‌ని పోల్చి చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. వన్డే వరల్డ్ కప్ 2019లో 10 జట్లు పాల్గొంటే, అందులో రెండు జట్లు మాత్రమే అదే కెప్టెన్లతో 2022 టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాయి. వాళ్లే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్..

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాని నడిపించబోతున్నాడు...

2019 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాకి ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్‌గా వ్యవహరించగా ఈసారి తెంబ భవుమా కెప్టెన్సీలో సఫారీ జట్టు పొట్టి ప్రపంచకప్ ఆడబోతోంది. అలాగే అప్పుడు లంక జట్టుకి దిముత్ కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహరిస్తే, ఇప్పుడు ధస్సున్ శకన సారథిగా వ్యవహరించబోతున్నాడు...

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్ కప్‌‌కి గెలిచింది ఇంగ్లాండ్. మోర్గాన్ కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో ఈసారి జోస్ బట్లర్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడుతోంది ఇంగ్లాండ్. 

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో వెస్టిండీస్ జట్టును జాసన్ హోల్డర్ నడిపించగా ఈసారి నికోలస్ పూరన్ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచ కప్ ఆడబోతోంది విండీస్... అప్పుడు బంగ్లా జట్టును ముష్‌రఫ్ మోర్తాజా నడిపించగా ఈసారి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ఆడుతోంది బంగ్లాదేశ్...
 

Babar Azam

2019 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టుకి సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌ని బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో ఆడుతోంది పాకిస్తాన్...అప్పుడు ఆఫ్ఘాన్‌ టీమ్‌ని అస్గర్ ఆఫ్ఘాన్‌ నడిపించగా ఈసారి మహ్మద్ నబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు...

2019 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్, 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఫైనల్‌కి దూసుకెళ్లింది. రెండు సార్లు రన్నరప్‌గా నిలిచిన కివీస్‌తో పాటు 2021 టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా మాత్రమే మూడేళ్లుగా ఒకే సారథిగా కొనసాగిస్తున్నాయి. 

aaron finch

అయితే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డేల నుంచి తప్పుకున్నాడు. త్వరలో ఆస్ట్రేలియా వన్డేలకు కొత్త కెప్టెన్‌ని ప్రకటించబోతోంది. దీంతో వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌ 2023లో ఆస్ట్రేలియా కూడా కొత్త కెప్టెన్‌తో ఆడబోతోంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది...   

click me!