ఒకడు అలా, మరొకడు ఇలా... గోల్ఫ్ కోర్సులో కిందపడి, టీ20 వరల్డ్ కప్‌కి దూరమైన జానీ భాయ్...

First Published Sep 3, 2022, 4:49 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌ స్టో... గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి దూరమయ్యాడు. గోల్ఫ్ కోర్సులో ఆడుతూ కాలుజారి కిందపడిన జానీ బెయిర్‌స్టో, తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఇప్పట్లో జరగబోయే సిరీస్‌లకు, టూర్లకు అందుబాటులో ఉండడం లేదంటూ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియచేశాడు జానీ బెయిర్‌స్టో...

Jonny Bairstow

2022లో జానీ బెయిర్‌స్టో మంచి ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో, ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌లో మిగిలిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫెయిల్ అయిన చోట సెంచరీలతో చెలరేగాడు జానీ బెయిర్ స్టో. ఈ ఏడాది 10 టెస్టుల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలతో 1061 పరుగులు చేశాడు బెయిర్‌స్టో...

Image credit: Getty

ఈ ఏడాది 3 టీ20 మ్యాచులు ఆడిన జానీ బెయిర్‌స్టో, 49 సగటుతో 147 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 1344 అంతర్జాతీయ పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, ఐపీఎల్ 2022లోనూ మంచి పర్పామెన్స్ కనబరిచాడు...
 

ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ విధంగానే క్రికెట్‌కి దూరమయ్యాడు. తన ఇంట్లో ఓ ఫిష్ ట్యాంక్‌ని క్లీన్ చేస్తున్న సమయంలో అది జారపడి పగిలిపోవడంతో ఆర్చర్ చేతికి గాయమైంది. ఈ గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ చేతి వేళ్లలోకి గాజు పెంకులు చొచ్చుకుపోయాయి. వాటిని తీసేందుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది...
 

ఈ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి దూరంగా ఉన్నాడు జోఫ్రా ఆర్చర్. అలాగే ఐపీఎల్ 2022 సీజన్, యాషెస్ సిరీస్‌లో కూడా పాల్గొనని జోఫ్రా ఆర్చర్... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా అందుబాటులో ఉండడం లేదు...

Image Credit: Getty Images

గాయపడిన జానీ బెయిర్‌స్టో స్థానంలో బెన్ డక్లెట్‌ని సౌతాఫ్రికాతో జరిగే మూడో టెస్టు ఆడే జట్టులో చోటు కల్పించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జానీ బెయిర్‌స్టో స్థానంలో ఏ ప్లేయర్‌కి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది...

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు క్రికెట్ ఆడుతూ గాయపడుతూ సిరీస్‌లకు దూరమవుతుంటే... ఇంగ్లాండ్ ప్లేయర్లు వింత వింత విధాలుగా గాయపడుతుండడం విశేషం...  ఇంగ్లాండ్ వాళ్ల కంటే మా వాళ్లే కాస్త బెటర్ అంటున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్..

click me!