Jay shah
బిసిసిఐ కార్యదర్శి జై షా ఐసిసి నూతన ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇప్పటివరకు ఐసిసి బాధ్యతలు చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. కేవలం 35 ఏళ్ళ వయసులోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలు చేపట్టనున్నారు జై షా.
16 మంది సభ్యులతో కూడిన ఐసిసి పాలకవర్గ అధ్యక్ష పదవికి ఎన్నికలు చేపట్టారు. ప్రస్తుత ఐసిసి చీఫ్ గ్రెగ్ బార్క్లె పదవికీలం ఈ ఏడాది నవంబర్ లో ముగుస్తుంది. దీంతో ఆలోపు నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను చేపట్టారు. ఇటీవల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగిసింది. కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నవంబర్ 30న ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే పదవీకాలం ముగియనుంది... అంటే డిసెంబర్ ఆరభంలో జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఆ తర్వాత కూడా కొనసాగాలంటూ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వుంటుంది.
అయితే జై షా కంటే ముందు ఐసిసి ఛైర్మన్లుగా పలువురు భారతీయులు పనిచేసారు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ ను శాసించిన ఆ భారతీయులెవరో చూద్దాం.
Jagmohan Dalmiya
జగ్‌మోహన్ దాల్మియా (1997-2000) :
భారతీయ క్రికెట్ చరిత్రలో నిలిచివుండే పేరు జగ్‌మోహన్ దాల్మియా. ఈయన హయాంలో భారత క్రికెట్ అత్యున్నత స్థాయికి చేరింది. ఇలా బిసిసిఐలో కీలక బాధ్యతలు చేపట్టిన ఈయన 1997 నుండి 2000 వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్ గా పనిచేసారు. క్రికెట్ మ్యాచ్‌ల స్లాట్‌లను టెలివిజన్ ఛానెళ్లకు వేలం వేయడం ద్వారా బోర్డు ఆదాయాన్ని పెంచారు. క్రికెట్ నుండి ఆదాయాన్ని పొందే ఆయన నమూనే నేడు ప్రపంచంలోని అన్ని బోర్డులను ధనవంతులుగా మార్చింది. ఈయన బిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోని అన్ని బోర్డుల కంటే BCCIని ధనవంతులుగా మార్చిన ఘనత దాల్మియాకే దక్కుతుంది.
Sharad Pawar
శరద్ పవార్ (2010-2012) :
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, ఎన్సిపి అధ్యక్షులు శరద్ పవార్ కూడా ఐసిసి ఛైర్మన్ గా పనిచేసారు. 2010 నుండి 2012 వరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చీఫ్ గా పనిచేశారు. అంతకుముందు 2005 నుండి 2008 వరకు బిసిసిఐ అధ్యక్షుడిగా కూడా పనిచేసారు.
N. Srinivasan
ఎన్. శ్రీనివాసన్ (2014-2015):
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్. శ్రీనివాసన్ ఐసిసి ఛైర్మన్ గా కూడా చేసారు. 2014లో ICC చైర్మన్ పదవిని చేపట్టారు. ఆయన హయాంలో ICC కీలకమైన పరిపాలనా మార్పులను తీసుకొచ్చింది. "బిగ్ త్రీ" క్రికెట్ బోర్డులకు మరింత అధికారం ఇవ్వడం ఇందులో భాగం. బిగ్ త్రీ అంటే భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పందెం కుంభకోణానికి సంబంధించిన వివాదాలతో ఆయన పదవీకాలం ముగిసింది.
Shashank Manohar
శశాంక్ మనోహర్ (2015-2020):
శశాంక్ మనోహర్ 2015 నుండి 2020 వరకు ICC చైర్మన్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన BCCI అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు. ICC అధ్యక్షుడిగా, ప్రపంచ క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి... "బిగ్ త్రీ" బోర్డుల ప్రభావాన్ని తగ్గించడానికి పరిపాలనా నిర్మాణంలో సంస్కరణలు తీసుకొచ్చారు. క్రికెట్ ఆడే అన్ని దేశాల మధ్య ఆదాయ పంపిణీని పెంచడానికి ఆయన హయాంలో కృషి జరిగింది.