
IPL Retention - Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కు ముందు ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటైన్, వదులుకున్న ప్లేయర్ల లిస్టును అధికారికంగా ప్రకటించాయి. ఈ క్రమంలోనే చాలా ఫ్రాంఛైజీలు స్టార్ ప్లేయర్లకు షాకిచ్చాయి. భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది.
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ చాలా కాలం నుంచి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో స్టార్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 9 సంవత్సరాల అనుబంధం గురువారం అధికారికంగా ముగిసింది.
అతని ఢిల్లీ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తాడు. కాబట్టి రిషబ్ పంత్ తో తమ టీమ్స్ లోకి తీసుకోవడానికి అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తిని చూపుతున్నాయి. వేలంలో అధిక ధర పలికే ప్లేయర్లలో ఒకరిగా రిషబ్ పంత్ ఉన్నాడు.
రిషబ్ పంత్-ఢిల్లీ మధ్య బంధం ఎందుకు తెగిపోయింది?
ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమానులు GMR, JSW. ఇవి వరుసగా రెండు సంవత్సరాల పాటు నిర్వహణ నియంత్రణను చేపడతాయి. కాబట్టి JSW ద్వారా ఎంపిక చేయబడిన రిషబ్ పంత్ GMR మొదటి ఎంపిక కాదు. GMR ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహణలోకి వచ్చిన తర్వాత క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో సహా మాజీ కోచింగ్ మేనేజ్‌మెంట్ లో మార్పులు చేశారు.
సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావు వచ్చారు. అలాగే, పలు రిపోర్టుల ప్రకారం.. వేణు గోపాల్ రావు, హేమాంగ్ బదానీల రాకతో రిషబ్ పంత్ సంతోషంగా లేడు. దీనికి తోడు రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం గత నెలలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. కొత్త కోచింగ్ సిబ్బందితో కలిసి పనిచేయడానికి పంత్ ఇష్టపడలేదు. ఈ కారణంగానే ఢిల్లీతో రిషబ్ పంత్ విడిపోయాడని పలు మీడియా నివేదికలు, క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్టులో అక్షర్ పటేల్ (రూ. 16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు) లు ఉన్నారు. రిటెన్షన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం రూ. 43.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఆ టీమ్ వద్ద వేలం కోసం పర్సులో రూ. 76 కోట్లు ఉన్నాయి.
కాగా, ఐపీఎల్ 2025 వేలం నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగుతుంది. దీనిని విదేశాలలో నిర్వహించే అవకాశాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పరిశీలిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి పేరు మొదటి స్థానంలో ఉండగా, మస్కట్ లేదా దోహాల పేర్లను కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
చెన్నై టీమ్ లోకి రిషబ్ పంత్..?
ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ను రిటైన్ చేసుకోకపోవడంతో అతను ఐపీఎల్ వేలంలోకి వచ్చాడు. ఈ నెలాఖరులో జరగనున్న మెగా వేలంలో అతను ఖచ్చితంగా అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఒకడు అవుతాడు. అనేక జట్లు వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ను సంప్రదిస్తున్నట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు అనేక జట్లు రిషబ్ పంత్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కాబట్టి ఆ జట్టు పర్సులో రూ. 110.5 కోట్లు ఉన్నాయి. PBKS ప్రధాన కోచ్ గా వచ్చిన రికీ పాంటింగ్ కు రిషబ్ పంత్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. పంత్‌ను జట్టులోకి తీసుకురావడంలో ఆస్ట్రేలియా లెజెండ్ పాత్ర పోషించవచ్చు. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ కూడా రిషబ్ పంత్ కోసం చూస్తోందని సమాచారం.