మిస్టర్ కూల్ క్రికెటర్స్‌లో మరో కోణం! అంతా ఐపీఎల్ మహిమ... ద్రావిడ్, ధోనీ, మురళీధరన్‌...

First Published Apr 28, 2022, 5:40 PM IST

ఐపీఎల్... ప్రపంచంలో బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని చాలామంది విదేశీ, స్వదేశీ క్రికెటర్లు కలలు కంటారు. ఎందరో యువ క్రికెటర్లను రాత్రికి రాత్రి స్టార్లుగా మార్చిన ఐపీఎల్, లెజెండరీ క్రికెటర్లలోని మరో యాంగిల్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 22 పరుగులు కావాల్సి రావడంతో సన్‌రైజర్స్‌దే విజయం అనుకున్నారంతా...

అయితే మార్కో జాన్సెస్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో ఓ సిక్స్, సింగిల్‌తో 7 పరుగులు రాబ్టాడు రాహుల్ తెవాటియా. ఆ తర్వాత నాలుగు బంతుల్లో 3 సిక్సర్లు బాదిన రషీద్ ఖాన్... మ్యాచ్‌ని ముగించాడు...

Latest Videos


ఆఖరి ఓవర్‌లో మార్కో జాన్సెన్ యార్కర్లకు ప్రయత్నించకుండా లెంగ్త్ బాల్స్ వేస్తూ... రషీద్ ఖాన్‌కి సిక్సర్లు కొట్టే పనిని ఈజీ చేసేశాడు. జాన్సెన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో డగౌట్‌లో కూర్చొన్న ముత్తయ్య మురళీధరన్... తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు...

కూల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముత్తయ్య మురళీధరన్, టెంపర్ కోల్పోయి మార్కో జాన్సెన్ బౌలింగ్‌పై ‘ఎందుకు ఫుల్ బౌలింగ్ చేస్తున్నావ్...’ అంటూ బూతులు తిడుతూ కోపం వ్యక్తం చేయడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది...

ఐసీసీ టోర్నీల్లో ఓడినప్పుడు కూడా కూల్‌గా నవ్వుతూ కనిపించే ముత్తయ్య మురళీధరన్, ఇంత ఆగ్రహానికి గురి కావడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మురళీలోని ఈ కోణాన్ని చూపించిన ఘనత, ఐపీఎల్‌కే దక్కుతుందని ట్వీట్లు చేస్తున్నారు...

భారత క్రికెట్‌లో మిస్టర్ కామ్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో ఇలా కంట్రోల్ తప్పి, బహిరంగంగానే కోపాన్ని ప్రదర్శించాడు...

ముంబై ఇండియన్స్, రాజాస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ ఫాల్కనర్ ఆఖరి బంతికి 4 పరుగులు ఇవ్వడంతో అప్పుడు ఆర్ఆర్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తన క్యాప్ తీసి నేలకేసి కొట్టి... ఫ్రస్టేషన్‌ని చూపించడం టీవీల్లో కనిపించింది...

‘కెప్టెన్ కూల్‌’గా గుర్తింపు తెచ్చుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఐపీఎల్‌లో చాలాసార్లు టెంపర్ కోల్పోయాడు. 2019లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ నో బాల్ గురించి క్రీజులోపలికి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు మాహీ...

2020 సీజన్‌లో వైడ్ ఇవ్వబోయిన అంపైర్‌ను మాహీ గుర్రుగా చూడడం, ఆ అంపైర్ భయపడి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది...

ఐపీఎల్ వల్ల సత్తా ఉన్న టాలెంటెడ్ క్రికెటర్లు వెలుగులోకి రావడమే కాదు, కూల్ క్రికెటర్లలోని అగ్రెసివ్ యాంగిల్ కూడా చూసే అవకాశం దొరుకుతోందని అంటున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్..
 

click me!