Hardik Pandya
IPL 2024: అరంగేట్ర సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ లో వేలం జరగనుంది.
Hardik Pandya
ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవటం..వదిలించుకోవటం పై సమాలోచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసక్తిరమైన వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ముంబై జట్టు లోకి హార్దిక్ రావడం.. రోహిత్ శర్మ వెళ్లిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఐపీఎల్ టీంల ఆక్షన్ కు ముందే బదిలీ విండో నవంబర్ 26తో ముగుస్తుంది. బదిలీ విండో కింద, జట్లు పరస్పర అవగాహన ద్వారా ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు. అయితే, హార్దిక్ పునరాగమనంపై గుజరాత్ టైటాన్స్ గానీ, ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం గానీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
హార్దిక్ 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్ దాదాపు 15 కోట్ల రూపాయల ఖర్చుతో హార్దిక్ ను తీసుకోనుంది. అన్నీ సవ్యంగా సాగితే ఐపీఎల్ టోర్నమెంట్ లో ఇదే అతిపెద్ద ట్రేడింగ్ అవుతుంది.
2022లో జరిగిన భారీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ లను రిటైన్ చేసుకుంది. హార్దిక్ ను కొనసాగించకుండా పొలార్డ్ ను కొనసాగించడంపై ముంబై ఇండియన్స్ విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, హార్దిక్ ఫామ్ లో ఉన్న అవకాశాన్ని కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఉపయోగించుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆశిష్ నెహ్రా కోచ్ గా వ్యవహరించిన వీరిద్దరూ తొలి సీజన్ లోనే జట్టును టైటిల్ దిశగా నడిపించారు. హార్దిక్ నాయకత్వాన్ని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ విజయంతోనే హార్దిక్ కు భారత ట్వంటీ-20 జట్టు పగ్గాలు దక్కాయి. ఐపీఎల్ ఫైనల్లో హార్దిక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 2023లో కూడా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరింది. అయితే వీరిని చెన్నై ఓడించింది. హార్దిక్ నాయకత్వంలో గుజరాత్ ప్రిలిమినరీ రౌండ్ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ కు చేరింది.
గుజరాత్ తరఫున రెండు సీజన్లలో హార్దిక్ పాండ్యా 30 ఇన్నింగ్స్ ల్లో 41.65 సగటుతో 833 పరుగులు చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ గాయపడ్డాడు.
హార్దిక్ ను జట్టులోకి తీసుకోవాలంటే ముంబై కొంత మంది ఆటగాళ్లను విడుదల చేసి ఖజానాలో డబ్బును సమీకరించాల్సి ఉంటుంది. వేలంలో ఒక్కో జట్టుకు అదనంగా రూ.5 కోట్లు దక్కనున్నాయి. ముంబై ఇండియన్స్ అన్నీ సర్దుబాటు చేస్తే ఐపీఎల్ లో మూడో కెప్టెన్ గా హార్దిక్ నిలుస్తాడు.