ఐపీఎల్ 2023: చెన్నై సూపర్ కింగ్స్ బలం, బలగం ఆ నలుగురే... ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌లో...

First Published Mar 29, 2023, 10:59 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. 14 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన చెన్నై, 9 సార్లు ఫైనల్ ఆడింది. అందులో నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. 2020 సీజన్‌లో తొలిసారి ప్లేఆఫ్స్ చేరలేకపోయిన సీఎస్‌కే, 2022 సీజన్‌లో ఏకంగా 9వ స్థానంలో నిలిచి చెత్త ప్రదర్శన నమోదు చేసింది..

సీఎస్‌కేతో పాటు ముంబై ఇండియన్స్ కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిల్యూర్ అభిమానులను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అదీకాకుండా దీపక్ చాహార్ గాయంతో టీమ్‌కి దూరం కావడం, కెప్టెన్సీ మార్పులు, రవీంద్ర జడేజా- టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య గొడవలు... ఇలా సీఎస్‌కే ఫెయిల్యూర్‌కి చాలా కారణాలున్నాయి...
 

ఐపీఎల్ 2020 సీజన్‌లో 7వ స్థానంలో నిలిచిన సీఎస్‌కే, ఆ తర్వాతి సీజన్‌లో టైటిల్ గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అలాంటి పర్ఫామెన్స్ ఆశిస్తున్నారు తమిళ తంబీలు...
 

Latest Videos


Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్రధాన బలం, బలగం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బౌలర్ దీపక్ చాహార్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. అయితే ఈ నలుగురే, సీఎస్‌కేకి బలహీనతగా కూడా మారాయి. కారణం ఏంటంటే..
 

Image credit: PTI

సీఎస్‌కేకి నాలుగు టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు.. . ఐపీఎల్ 2020, 2021, 2022 సీజన్లలో కలిపి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు ధోనీ. 2023 సీజన్‌తో ధోనీ, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది... ఇది టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపవచ్చు...

ధోనీకి ఫేర్‌వెల్ సీజన్‌లో టైటిల్ అందించాలనే ప్రెషర్, మిగిలిన ప్లేయర్లలో ఉంటుంది. ఇది వారి పర్ఫామెన్స్‌ని దెబ్బ తీయొచ్చు. ఇక రవీంద్ర జడేజా సంగతి సరే సరి! గత ఏడాది టీమ్ మేనేజ్‌మెంట్‌కీ, రవీంద్ర జడేజాకి మధ్య విభేదాలు వచ్చాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రెండే మ్యాచులు ఆడిన జడేజా, గాయం వంకతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

రవీంద్ర జడేజాని సీఎస్‌కే  సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం, జడ్డూ, చెన్నై టీమ్‌కి సంబంధించిన ఫోటోలు, ట్వీట్లు, కామెంట్లు అన్నీ డిలీట్ చేయడం జరిగిపోయింది... అదీకాకుండా గత సీజన్‌లో జడేజా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.. ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించే రవీంద్ర జడేజా, ఈసారి ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తాడనేదానిపైనే సీఎస్‌కే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి..

పవర్ ప్లేలోనే ఒకటి రెండు వికెట్లు తీసి, ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు దీపక్ చాహార్... అందుకే అతన్ని 2022 మెగా వేలంలో రూ.14 కోట్లు పెట్టి తిరిగి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.. 

అయితే గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరమైన దీపక్ చాహార్, 2023 సీజన్‌లో ఆడబోతున్నాడు. అయితే ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన దీపక్ చాహార్, 6 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. కొంతకాలంగా వెన్ను సమస్యతో బాధపడుతున్న చాహార్, పూర్తిగా గాయం నుంచి కోలుకున్నాడా? లేదా? అనేది తెలీదు.  గాయం నుంచి కోలుకున్నా, మునుపటి ఫామ్‌ని అందుకోగలడా? అనేది అనుమానమే..

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... ధోనీ తర్వాత సీఎస్‌కే టీమ్‌ని నడిపించబోయే సారథిగా బెన్ స్టోక్స్‌ని చూస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. అయితే ఐపీఎల్‌లో రికార్డు ధర దక్కించుకున్న ప్లేయర్లు ఎవ్వరూ... గతంలో  అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు..

ben stokes

అదీకాకుండా బెన్ స్టోక్స్, ఐపీఎల్‌ 2023 సీజన్ చివరి మ్యాచులకు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. కీలక మ్యాచుల్లో బెన్ స్టోక్స్ ఆడకపోతే సీఎస్‌కేపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది...
 

Image credit: PTI

 3 సీజన్ల తర్వాత సొంత మైదానంలో, సొంత జనాల మధ్య మ్యాచులు ఆడనుంది చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇదే సీఎస్‌కే టీమ్‌కి ప్రధాన బలం. రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ, ధోనీ, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు రూపంలో సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది...
 

బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ, మహీశ్ తీక్షణ, సిసండ మగళ, దీపక్ చాహార్, ముకేశ్ కుమార్ చౌదరి, మథీష పతిరానా రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఓవర్‌ లోడ్‌ ఎమోషన్స్‌తో బరిలో దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్, ఐదో టైటిల్ గెలవాలంటే అభిమానుల అంచనాలు అందుకునే రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే..

click me!