హెడ్ కోచ్ మారాడు, మరో కెప్టెన్ వచ్చాడు ... ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ సారథిగా శిఖర్ ధావన్...

First Published | Nov 3, 2022, 11:34 AM IST

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ రూటే సెపరేటు. ఒకే ఒక్కసారి ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్, రెండు సార్లు మాత్రమే సెమీ ఫైనల్ చేరగలిగింది. లక్ కలిసి రావడం లేదని జెర్సీ రంగును, లోగోను.. ఆఖరికి ఫ్రాంఛైజీ పేరును కూడా మారుస్తూ వస్తున్న పంజాబ్ కింగ్స్... ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు మరోసారి కెప్టెన్‌ని మార్చింది... 

ఇప్పటికే 15 సీజన్లలో 14 మంది కెప్టెన్లను మార్చిన పంజాబ్ కింగ్స్, లక్ కలిసి వస్తుందేమోనని ఫ్రాంఛైజీ పేరు, లోగోలను కూడా మార్చింది. అయితే ఏదీ కలిసి రాలేదు. రెండు నెలల క్రితం హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్థానంలో ట్రేవర్ బేలిస్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రీతి జింటా టీమ్..

Image credit: PBKS

2022 సీజన్ ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ కూడా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2019 అక్టోబర్ నుంచి పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు... 


హెడ్ కోచ్‌ మార్పు సమయంలో మయాంక్ అగర్వాల్‌పై భరోసా పెట్టామని, అతనే 2023 సీజన్‌లోనూ పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉంటాడని ప్రకటించింది ఫ్రాంఛైజీ యాజమాన్యం. అయితే బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకు మయాంక్ అగర్వాల్, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట.

దీంతో మయాంక్ అగర్వాల్ స్థానంలో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ని ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పంజాబ్ కింగ్స్. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌లో ఓ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు శిఖర్ ధావన్. 

Image credit: PTI

2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా నియమించుకుంది పంజాబ్ కింగ్స్. గత సీజన్‌లో బ్యాటర్‌గా మెప్పించిన మయాంక్ అగర్వాల్, ఈసారి కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్‌లోనూ సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక ఫెయిల్ అయ్యాడు...

2021 సీజన్‌లో కెఎల్ రాహుల్ కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరడంతో ఓ మ్యాచ్‌కి కెప్టెన్సీ చేశాడు మయాంక్ అగర్వాల్. ఆ తర్వాత 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయ్యాడు. 2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ గాయపడడంతో ఓ మ్యాచ్‌కి సారథిగా వ్యవహరించిన శిఖర్ ధావన్, 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌‌ జట్టుకి కెప్టెన్సీ చేయబోతుండడం విశేషం. 

Latest Videos

click me!