వార్నర్‌ని వదులుకోవడమే సన్‌రైజర్స్ చేసిన అతిపెద్ద తప్పు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

First Published May 21, 2022, 2:48 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగింది. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు లేవు. అదీకాకుండా డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్లను ఐపీఎల్ 2022 మెగా వేలానికి వదిలేసింది ఆరెంజ్ ఆర్మీ...

మొదటి రెండు మ్యాచుల్లో ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు కూడా అలాగే సాగింది. వరుసగా రెండో సీజన్‌లోనూ సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్‌లో నిలవడం ఖాయమనుకున్నారంతా. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకుంది ఎస్‌ఆర్‌హెచ్... 

గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో, కేకేఆర్‌పై, పంజాబ్ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో, ఆర్‌సీబీపై 9 వికెట్ల తేడాతో ఘన విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... టాప్ టీమ్ పర్ఫామెన్స్ చూపించింది. దీంతో ఒక్కసారి సన్‌రైజర్స్, టైటిల్ ఫెవరెట్‌గా మారిపోయింది...

అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, సెకండ్ ఫేజ్‌లో పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఐదింట్లో గెలిచి, ఐదింట్లో ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చినా ప్లేఆఫ్స్ చేరేందుకు అది సరిపోలేదు...

రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, అభిషేక్ శర్మ వంటి బ్యాటర్లు ఆకట్టుకున్నా, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించినా... సన్‌రైజ్‌ అవ్వలేదు... ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చిన కేన్ విలియంసన్, వరుసగా ఫెయిల్ అయ్యి, జట్టుకి భారంగా మారాడు...
 

35 ఏళ్ల డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించి, టీమ్ నుంచి తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... భారీ మూల్యం చెల్లించుకుంది. వార్నర్‌ని వేలంలో రూ.6.25 కోట్లకు కొన్న ఢిల్లీ క్యాపిటల్స్... అతన్ని కరెక్టుగా వాడుకుంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 11 మ్యాచుల్లో 53.38 సగటుతో 151.96 స్ట్రైయిక్ రేటుతో 427 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు... సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున మూడు ఆరెంజ్ క్యాప్‌లు గెలిచిన వార్నర్ భాయ్‌ని వదులుకోవడమే ఆ జట్టు చేసిన పెద్ద తప్పిదమంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...

David Warner

‘డేవిడ్ వార్నర్‌ని వేలానికి వదిలేయడమే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన అతిపెద్ద తప్పిదం. అలాంటి ప్లేయర్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే అతను మ్యాచ్ విన్నర్...

డేవిడ్ వార్నర్ స్థానంలో ఓ భారత కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, అతన్ని తప్పించేవాళ్లా? సెలక్షన్ గురించి కామెంట్లు చేశాడని టీమ్ నుంచి తొలగించేవాళ్లా?

టీమ్ మేనేజ్‌మెంట్ కష్టకాలంలో డేవిడ్ వార్నర్‌కి అండగా నిలవాల్సింది, కానీ వాళ్లు అలా చేయలేదు. అలా చేసి ఉంటే ఈసీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్ఫామెన్స్ మరోలా ఉండేది...

విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌లో లేక ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆర్‌సీబీ అతన్ని బ్యాక్ చేసింది. ఫామ్‌లో లేకపోయినా ఫలితాలతో సంబంధం లేకుండా ఆడించింది.. ఎందుకంటే విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నర్ అని ఆర్‌సీబీకి తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

click me!