ఎమ్మెస్ ధోనీ ఆఖరి ఐపీఎల్ మ్యాచ్! చెన్నై పరువు కోసం, రాయల్స్ ప్లేఆఫ్స్ కోసం...

First Published May 20, 2022, 6:21 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌ 2022 సీజన్ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ పలకబోతున్నాడా? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా సరైన సమాధానం దొరకలేదు. అయితే మాహీ వచ్చే సీజన్‌లో బ్యాటర్‌గా బరిలో దిగకపోవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి...

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఎమ్మెస్ ధోనీ. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని మాహీ, ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు...

2020 సీజన్ సమయంలోనే ఎమ్మెస్ ధోనీతో కలిసి ఫోటోలు దిగడానికి యంగ్ క్రికెటర్లు పోటీపడ్డారు... పాండ్యా బ్రదర్స్ కూడా మాహీ ఎల్లో జెర్సీపై ఆటోగ్రాఫ్స్ తీసుకోవడంతో అనుమానాలు రేగాయి...

Latest Videos


అయితే 2020 సీజన్‌ని ఏడో స్థానంలో ముగించిన చెన్నై సూపర్ కింగ్స్, ఆఖరి లీగ్ మ్యాచ్‌ సమయంలో రిటైర్మెంట్ ఆలోచన లేదని ‘Definately Not’ అంటూ కామెంట్లు చేశాడు ఎమ్మెస్ ధోనీ...

2021 సీజన్‌లో టైటిల్ గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, 2022 సీజన్‌లో మరోసారి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. సీజన్‌ని 9వ స్థానంలో ముగించే ప్రమాదంలో ఉన్న సీఎస్‌కే, నేడు రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది...

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, నేటి మ్యాచ్‌ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. ఓడినా నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోగలుగుతంది...

అయితే నేటి మ్యాచ్ సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుందా? అనే విషయంపైనే క్లారిటీ రావడం లేదు. 41 ఏళ్ల వయసులో మాహీ వచ్చే సీజన్ ఆడడానికి ఇష్టపడతాడా? లేదా?.. నేడు ధోనీ చెప్పే సమాధానంతోనే తేలిపోనుంది...

ఐపీఎల్‌ కెరీర్‌లో 233 మ్యాచులు ఆడి 4952 పరుగులు చేసిన మాహీ, నేడు మరో 48 పరుగులు చేస్తే, 5 వేల మైలురాయి అందుకుంటాడు. 345 ఫోర్లు, 228 సిక్సర్లు అందుకున్న మాహీ, వికెట్ కీపర్‌గా 135 క్యాచులు అందుకుని 39 స్టంపౌట్లు చేశాడు. 

ఎమ్మెస్ ధోనీ ప్లేయర్‌గా రిటైర్మెంట్ ప్రకటించినా, బ్యాటింగ్ కోచ్‌గా లేదా మెంటర్‌గా వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి అందుబాటులో ఉంటాడని ప్రచారం నడుస్తోంది... 

click me!