ముంబై ఓడిందా... పరువు గోవిందా! చెన్నై ఓడిందా... ప్లేఆఫ్స్‌ ఛాన్సులు గోవిందా...

First Published May 12, 2022, 5:54 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మ్యాచులన్నీ వన్‌ సైడెడ్‌గా సాగుతూ, ఫ్యాన్స్‌ని తీవ్రంగా డిస్సప్పాయింట్ చేస్తున్నాయి. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, సూపర్ ఓవర్ మ్యాచులు చూద్దామని ఆశపడిన అభిమానులకు మరోసారి ఐపీఎల్ ‘El clasico’ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు...

ఐపీఎల్‌ చరిత్రలో 9 టైటిల్స్‌ని ఖాతాలో వేసుకున్న ఈ రెండు జట్లు తలబడితే ‘పైసా వసూల్’ వినోదం గ్యారెంటీ. 2022 సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్‌, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది...

ఆఖరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 16 పరుగులు కావాల్సి రాగా, ఎమ్మెస్ ధోనీ 6, 4, 2, 4 బాది మ్యాచ్‌ని ముగించి... ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్‌‌గా తన పేరును సార్థకం చేసుకున్నాడు...

Latest Videos


అయితే ఈసారి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌ ఇరుజట్లకీ చాలా కీలకంగా మారింది. ఇప్పటికే 11 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 9 పరాజయాలు చవిచూసింది...

పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవకుండా ముగించాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది ముంబై ఇండియన్స్. 4 పాయింట్లతో ఉన్న ముంబై, మిగిలిన మూడు గెలిస్తే 10 పాయింట్లతో బెటర్ పొజిషన్‌లో ముగించేందుకు అవకాశాలు ఉంటాయి...

మరోవైపు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి కూడా ఈ మ్యాచ్ ఫలితం చాలా అవసరం. 11 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న సీఎస్‌కే, ప్లేఆఫ్స్‌ రేసులో ఆశలను ఇంకా సజీవంగానే నిలుపుకుంది...

సీఎస్‌కే మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే 14 పాయింట్లతో మిగిలిన జట్లతో పోటీ పడే అవకాశాలు ఉంటాయి. నేటి మ్యాచ్‌లో ఓడితే... ముంబై ఇండియన్స్ తర్వాత అధికారికంగా ప్లేాఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా నిలుస్తుంది చెన్నై సూపర్ కింగ్స్...

నేటి మ్యాచ్‌లో ఓడితే చెన్నై సూపర్ కింగ్స్, ఆఖరి స్థానంలో ముగించే ప్రమాదంలోనూ పడుతుంది. నేటి మ్యాచ్‌తో పాటు మిగిలిన రెండు మ్యాచుల్లో సీఎస్‌కే పరాజయం పాలై, ముంబై ఇండియన్స్ మిగిలిన మూడు మ్యాచులు గెలిస్తే... స్థానాలు తారుమారు అవుతాయి...

దీంతో నేటి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ పోరు ఒకరికి పరువు సమస్య కాగా, మరొకరికి ప్లేఆఫ్స్ అవకాశాలు నిలుపుకునే చివరి ఆశగా మారింది...

click me!