IPL Auction: మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంత నిర్ణయించాడంటే..!!

First Published Jan 26, 2022, 5:47 PM IST

S. Sreesanth Registers His Name for Mega Auction: ఐపీఎల్ మెగా వేలా (ఫిబ్రవరి 12, 13)నికి సమయం దగ్గర పడుతున్నది. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ  పేసర్, కేరళ స్పీడ్ స్టర్  ఎస్. శ్రీశాంత్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.  

మరో రెండు నెలల్లో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-15 సీజన్ లో భాగంగా  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వచ్చే నెలలో ఈ లీగ్ కోసం మెగా వేలాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే.  వేలం కోసం ఇప్పటికే పలు దేశాల నుంచి  వందలాది మంది ఔత్సాహిక క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు.

తాజాగా.. టీమిండియా మాజీ పేసర్ ఎస్.శ్రీశాంత్ కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తన పేరును రిజిష్టర్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా  ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.
 

2021 వేలం సందర్భంగా కూడా శ్రీశాంత్ రిజిష్టర్ చేసుకున్నా అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుక్కోలేదు.  ఆ సమయంలో అతడు తన కనీస ధరను  రూ. 75 లక్షలుగా నిర్ణయించాడు. కానీ ఈ సారి మాత్రం శ్రీశాంత్.. తన బేస్ ప్రైస్ ను తగ్గించాడు. దానిని రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు. 
 

శ్రీశాంత్ చివరిసారిగా 2013 ఐపీఎల్ లో ఆడాడు. కానీ అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై వేటు వేసింది. శ్రీశాంత్ జీవితకాలం ఆడకుండా నిషేధం విధించింది. 
 

అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.  సుప్రీంకోర్టులో అతడికి ఊరట లభించింది. 2019లో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని పున:పరిశీలించాల్సిందిగా బీసీసీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీసీసీఐ.. శ్రీశాంత్ పై నిషేధాన్ని ఏడేండ్లకు కుదించింది.

శిక్ష  ఏడేండ్లకు కుదించడంతో 2020 సెప్టెంబర్ లో శ్రీశాంత్ పై నిషేధం తొలిగింది. అనంతరం అతడు 2021 లో సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో కేరళ తరఫున ఆడాడు.   ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో ఆరు మ్యాచులలో 13 వికెట్లు పడగొట్టాడు. ఏడేండ్ల తర్వాత గ్రౌండ్ లోకి వచ్చినా అతడు మాత్రం తన బౌలింగ్ లో పదును తగ్గలేదని నిరూపించాడు. 

నిషేధానికి ముందు శ్రీశాంత్ 44 ఐపీఎల్ మ్యాచులాడాడు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున  అతడు ప్రాతినిథ్యం వహించాడు. 44 మ్యాచులలో 44 వికెట్లు తీశాడు. ఐపీఎల్ తొలి సీజన్ (2008)లో  కప్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్  జట్టులో శ్రీశాంత్ సభ్యుడు. 

అంతేగాక భారత జట్టు ప్రపంచకప్పులు గెలిచిన జట్టులో కూడా శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ ఆడిన సభ్యులలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. దీంతో గొప్ప ప్రదర్శనలు ఏమీ చేయకపోయినా అతడిని  లక్కీ బౌలర్ గా పరిగణించేవారు టీమిండియా ఫ్యాన్స్..

click me!