IPL2021: మూడు మ్యాచులు, ఆరుగురు కుర్రాళ్లు... ఐపీఎల్ 2021 ఫేజ్‌2లో మన కుర్రాళ్ల జోరు...

First Published Sep 22, 2021, 4:16 PM IST

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రధాన ఉద్దేశంతో సత్తా ఉన్న క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేయడం. ఎంతో టాలెంట్ ఉన్నా, టీమిండియాలో తుది 11 మంది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న క్రికెటర్ల కెరీర్ గ్రాఫ్‌ను మార్చేసింది ఐపీఎల్... ఐపీఎల్ నుంచి ఇప్పటిదాకా ఎందరో యువ క్రికెటర్లు, టీమిండియాలోకి వచ్చారు, వస్తున్నారు...

ఐపీఎల్ 2020 పర్ఫామెన్స్ ద్వారా వరుణ్ చక్రవర్తి, నటరాజన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యంగ్ క్రికెటర్లు టీమిండియాలో చోటు దక్కించుకున్నారు...

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్ పర్ఫామెన్స్ కారణంగా చేతన్ సకారియా, రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ రాణా వంటి యువ క్రికెటర్లకు శ్రీలంక టూర్‌లో అవకాశం ఇచ్చారు సెలక్టర్లు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లోనూ కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు... ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే... ఫేజ్ 2లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నింటిలోనూ మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చింది కుర్రాళ్లే...

Ruturaj Gaikwad-Photo Credit BCCI

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో షో మొత్తం రుతురాజ్ గైక్వాడ్‌దే... డుప్లిసిస్, సురేష్ రైనా, ఎమ్మెస్ ధోనీ, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు (రిటైర్డ్ హర్ట్) వంటి ప్లేయర్లు విఫలమైన చోట... అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు రుతురాజ్ గైక్వాడ్...

ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అదరగొడితే... బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి ఫ్యూచర్ స్టార్‌గా ఆశలు రేపాడు...

ఫేజ్ 2లో మొదటి రెండు మ్యాచులు ఒక ఎత్తు అయితే, రాజస్థాన్ - పంజాబ్ మధ్య జరిగిన మూడో మ్యాచ్ వేరే లెవెల్... తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ ఇన్నింగ్స్ ఇద్దరు యంగ్ స్టార్స్ బ్యాటింగ్‌లో రాణించారు...

అండర్-19 వరల్డ్‌కప్ నుంచి వచ్చిన యశస్వి జైస్వాల్‌ 49 పరుగులు చేయగా, మహిపాల్ లోమ్రోర్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు...

పంజాబ్ కింగ్స్ యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళల అర్ష్‌దీప్ సింగ్, జయ్‌దేవ్ ఉనద్కడ్ (2013లో 21 ఏళ్ల వయసులో) తర్వాత అతిపిన్న వయసులో ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

వీళ్లందరి పర్ఫామెన్స్ ఊహించవచ్చు, కానీ ఆఖరి ఓవర్‌లో మ్యాజిక్ స్పెల్‌తో విజయంపై ఆశలు వదిలేసుకున్న రాజస్థాన్‌కి అద్వితీయ విజయాన్ని అందించాడు కార్తీక్ త్యాగి...

20 ఏళ్ల కార్తీక్ త్యాగి, ఆఖరి ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి... రాజస్థాన్ రాయల్స్‌కి విజయాన్ని, పంజాబ్ కింగ్స్‌కి ఊహించని పరాజయాన్ని అందించాడు...

లక్ష్యఛేదనలో 20వ ఓవర్‌లో అతి తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ఐపీఎల్‌లో టాప్‌లో నిలిచాడు కార్తీక్ త్యాగి.. 2009లో మునాఫ్ పటేల్ తర్వాత ఆరు పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని అందించిన రెండో బౌలర్ కార్తీక్ త్యాగి. 

ఇప్పటికే భారత జట్టు రిజర్వు బెంచ్ అత్యంత పటిష్టంగా ఉంది. టీమిండియాలో ప్లేస్ కోసం దాదాపు 50 మంది పోటీలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే ఈ ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ముగిసేవరకి మరో 10 మంది కుర్రాళ్లు కూడా భారత జట్టులో చోటు కోసం సిద్ధమైపోతారు... ఇక సెలక్టర్లకు పెద్ద తలనొప్పే...

click me!