IPL 2021: ఫేజ్ 2లో బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్... ఆఖరి ఓవర్ వరకూ పోరాడి...

First Published Sep 19, 2021, 11:24 PM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో నుంచి కోలుకుని 156 పరుగులు చేసిన సీఎస్‌కే, ఆ లక్ష్యాన్ని కాపాడుకుని 20 పరుగుల తేడాతో విజయం సాధించింది..

157 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కి మూడో ఓవర్‌లోనే తొలి షాక్ తగిలింది. 12 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన డి కాక్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన సీఎస్‌కేకి అనుకూలంగా ఫలితం వచ్చింది...

ఆ తర్వాత మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న ఆన్‌మోల్ ప్రీత్ సింగ్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి... దీపక్ చాహార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత 7 బంతుల్లో 3 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను, డుప్లిసిస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు... ఆ తర్వాత ఇషాన్ కిషన్ 10 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ కావడంతో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై ఇండియన్స్...

14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్‌ను హజల్‌వుడ్ అవుట్ చేయగా, 5 బంతుల్లో 4 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ చేశాడు...

94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో వేగంగా పరుగులు రాబట్టడంలో ముంబై బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో ఆఖరి ఓవర్‌లో విజయానికి 23 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది ముంబై ఇండియన్స్...

15 బంతుల్లో 15 పరుగులు చేసిన ఆడమ్ మిల్నే, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కాగా  సౌరబ్ తివారి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు... 40 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసి సౌరబ్ తివారి టాప్ స్కోరర్‌గా నిలవగా, రాహుల్ చాహార్ డకౌట్ అయ్యాడు...

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌కి చేరుకోగా, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రేపు కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది...

click me!