INDvsENG 4th Test: మూడో రోజు పూర్తి ఆధిక్యం చూపించిన భారత్... నాలుగో రోజు రెండు సెషన్లు ఆడితే...

First Published Sep 4, 2021, 10:59 PM IST

బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆటను త్వరగా ముగించిన అంపైర్లు... ఆట ముగిసే సమయానికి 171 పరుగుల ఆధిక్యంలో భారత జట్టు... 

బ్యాడ్‌లైట్ కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట త్వరగా ముగించారు అంపైర్లు. ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది టీమిండియా. భారత జట్టు ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు, రవీంద్ర జడేజా 33 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 66 బంతుల్లో 33 పరుగులు చేశారు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 43/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు 83 పరుగుల వద్ద కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది.
101 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.

ఆ తర్వాత పూజారా, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి  278 బంతుల్లో 153 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
256 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 127 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, క్రిస్ వోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఇంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్‌లో మూడు సార్లు ఫుల్‌ షాట్‌కి ప్రయత్నించి అవుటైన రోహిత్, ఈసారి కూడా అలానే అవుట్ కావడం విశేషం... కొత్త బంతిని తీసుకున్న తర్వాతి తొలి డెలివరీకే ఇంగ్లాండ్‌కి వికెట్ దక్కడం విశేషం.

ఆ తర్వాత నాలుగో బంతికి ఛతేశ్వర్ పూజారా కూడా అవుటయ్యాడు. 127 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేసిన పూజారా, రాబిన్‌సన్ బౌలింగ్‌లో మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 237 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా.

ఒకే మ్యాచ్‌లో ఆరు రికార్డులు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ... 2021లో వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పూజారా, ఇంగ్లాండ్‌లో 2 వేల పరుగులను అందుకున్నాడు.

మూడు వేల టెస్టు పరుగులను పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ, 15 వేల అంతర్జాతీయ పరుగులతో పాటు మొట్టమొదటి ఓవర్‌సీస్ సెంచరీని అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...

click me!