రెండో టెస్టుకి ముందు టీమిండియాకి షాక్... భారీ జరిమానా, పాయింట్ల కోత విధించిన ఐసీసీ...

First Published Jan 1, 2022, 1:31 PM IST

సౌతాఫ్రికా టూర్‌ను విజయంతో ఆరంభించిన భారత జట్టుకి రెండో టెస్టుకి ముందు ఊహించని షాక్ తగిలింది. తొలి టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ...

సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 19 ఏళ్లలో సెంచూరియన్‌లో టీమిండియాకి దక్కిన తొలి విజయం ఇది...

అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా మూడు, ఐదో రోజుల్లో నెట్ ఓవర్ రేటు భారీగా తగ్గింది. తొలి రోజు పూర్తిగా 90 ఓవర్ల పాటు మ్యాచ్ సాగింది. 
 

అయితే రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే ఆట రద్దు అయ్యింది. మూడో రోజు 15.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, మిగిలిన 7 వికెట్లను కోల్పోయింది భారత జట్టు...

ఆ తర్వాత సౌతాఫ్రికాను 62.3 ఓవర్లలో ఆలౌట్ చేసి, అదే రోజున మళ్లీ రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది భారత జట్టు. రెండో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది...

ఓవరాల్‌గా మూడో రోజు ఆటలో 84 ఓవర్ల ఆట మాత్రమే వీలైంది. ఆ తర్వాత నాలుగో రోజు, ఐదో రోజు కూడా షెడ్యూల్ కంటే  6 ఓవర్లు తక్కువగా వేసింది భారత జట్టు...

దీంతో ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం టీమిండియా ప్లేయర్లు, సహాయక సిబ్బంది మ్యాచ్ ఫీజలో 20 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

అంతేకాకుండా స్లో ఓవర్ రేటు కారణంగా ఆర్టికల్ 16.11 ప్రకారం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ఓ పాయింట్‌ను పెనాల్టీగా విధించారు...

స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసినట్టు భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా మ్యాచు ఫీజు కోత, పెనాల్టీ పాయింట్లను విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో 7 టెస్టులు ఆడిన భారత జట్టు, 4 విజయాలు అందుకుని, ఓ మ్యాచ్ ఓడింది. రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి...

ప్రస్తుతం 63.09 శాతం విజయాలతో ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది భారత జట్టు. 

యాషెస్ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా, శ్రీలంక రెండు టెస్టుల్లో గెలిచి రెండో స్థానంలో ఉంది...

పాకిస్తాన్ నాలుగు టెస్టుల్లో మూడు విజయాలు, ఓ పరాజయం అందుకుని మూడో స్థానంలో ఉండగా... ఇండియాపై లీడ్స్‌లో సాధించిన విజయం తప్ప, ఐదు టెస్టుల్లో ఓడి, వర్షం కారణంగా ఓ మ్యాచ్ డ్రా చేసుకున్న ఇంగ్లాండ్... డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. 

click me!