అక్షర్ పటేల్ చేసిన తప్పును ఎత్తి చూపిన వసీం జాఫర్.. అంతా సూర్యకుమార్ యాదవ్ వల్లేనంటూ...

First Published Nov 28, 2021, 10:20 AM IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, అద్భుత స్పెల్‌తో ఐదు వికెట్లు తీసి, కివీస్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు. టెస్టు ఆరంగ్రేటం నుంచి అదరగొడుతున్న అక్షర్ పటేల్‌ చేసిన ఓ తప్పును ఎత్తి చూపాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్, తన మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అక్షర్, ఆ తర్వాత అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అక్షర్ పటేల్... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో 27 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కి ఆ తర్వాత అవకాశం రాలేదు..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి, ఇంగ్లాండ్ టూర్‌కి, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి (తర్వాత శార్దూల్ ఠాకూర్‌‌కి అక్షర్ పటేల్ ప్లేస్‌లో ఛాన్స్) ఎంపికైనా అక్షర్ పటేల్‌కి తుదిజట్టులో చోటు మాత్రం దక్కలేదు.

అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, నాలుగో టెస్టులో ఏడు ఇన్నింగ్స్‌లో ఐదు సార్లు ఐదేసి వికెట్లు తీసి, టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు...

2021 సీజన్‌లో నాలుగు టెస్టుల్లో 32 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు...

7 టెస్టుల్లో 41 వికెట్లు తీసిన అశ్విన్ టాప్‌లో ఉండగా పాక్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిదీ (8 టెస్టుల్లో 39), హసన్ ఆలీ (37 వికెట్లు)తో టాప్ 3లో అక్షర్ పటేల్ కంటే ముందున్నారు...

ఐదు వికెట్లు తీసిన ఇన్నింగ్స్‌కి గుర్తుగా తాను బౌలింగ్ వేసిన బంతిని తీసుకున్నాడు అక్షర్ పటేల్. అయితే ఈ బంతిపై నవంబర్ అని రాయడానికి బదులుగా అక్టోబర్ అని రాసి ఉంది...

‘అక్షర్ పటేల్ ఈ రోజు చేసిన ఒకే ఒక్క తప్పు, తేదీని తప్పుగా రాయడం. ఈరోజు 27 నవంబర్ హై బాపు...’ అంటూ అక్షర్ పటేల్ చేసిన తప్పును ఎత్తి చూపించాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

సీనియర్ క్రికెటర్ వసీం జాఫర్‌కి అక్షర్ పటేల్ వెంటనే సమాధానం ఇచ్చాడు... ‘అది నేను చేయలేదు. సూర్యకుమార్ యాదవ్, ఆ బాల్‌పై డేట్ రాసి ఇచ్చాడు...’ అంటూ రిప్లై ఇచ్చాడు అక్షర్ పటేల్...

‘ఓ... అలా అయితే సూర్యకుమార్ యాదవ్‌కి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. వెళ్లి ది వాల్ ముందు నిలబడు...’ అంటూ సూర్యకుమార్ యాదవ్‌ని ట్యాగ్ చేశాడు వసీం జాఫర్...

సూర్యకుమార్ యాదవ్... ‘ఆ పని అయితే నేను రోజూ చేస్తా...’ అంటూ సమాధానం ఇచ్చాడు. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయపడడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టు టీమ్‌లో చోటు కల్పించింది బీసీసీఐ.

ఇంగ్లాండ్‌‌లో టూర్ మధ్యలో జట్టులో కలిసి ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావడంతో ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కించుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌లో అయినా టెస్టు ఎంట్రీ ఇస్తాడో? లేదో? తెలియాల్సి ఉంది...

click me!