జహీర్ ఖాన్ కంటే నేనే బాగా బౌలింగ్ చేశా... లేదు జాఫర్, నీకంటే నేను బాగా బ్యాటింగ్ చేశా...

First Published Nov 25, 2021, 1:57 PM IST

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాకి చాలా సమయం కేటాయిస్తున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డున్న వసీం జాఫర్ క్రికెట్ మీమ్స్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ కూడా ఉంది...

క్రికెట్‌లో జరిగే ప్రతీ సంఘటనకు ఓ ఫన్నీ మీమ్‌ పోస్టు చేసి, అభిమానులను నవ్వించే వసీం జాఫర్... కొన్ని ఫజిల్స్‌తోనూ సోషల్ మీడియా మేధావుల బుర్రలకు పనులు చెబుతూ ఉంటాడు...

తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ గురించి భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, వసీం జాఫర్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్, ఫన్నీ ఫైట్ జరిగింది... దీనికి కారణం భారత జట్టు వరుసగా టాసులు గెలవడమే...

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా మూడు టాస్‌లు గెలిచాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత కాన్ఫూర్ టెస్టులోనూ అజింకా రహానే టాస్ గెలవడంతో వరుసగా నాలుగు మ్యాచుల్లో టాస్ టీమిండియా వశమైంది...

‘న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత జట్టు వరుసగా మూడు టాస్‌లు గెలిచిందంటే నమ్మలేకపోతున్నా. ఈ కాయిన్ ఏదైనా సీక్రెట్ చిప్ కాదు కదా... కరెన్సీ నోట్లలా నకిలీ కాయిన్ లాంటిది? ఉరికే అంటున్నా...

ఇలాంటి అరుదైన ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నా... నోట్: కేవలం క్రికెటర్లు మాత్రం దీనికి రిప్లై ఇవ్వాలి...’ అంటూ ట్వట్ చేశాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్...

దీనికి వసీం జాఫర్ స్పందించాడు... ‘అవును, వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ గెలవడం చాలా అరుదు. అయితే జహీర్ ఖాన్ కంటే వసీం జాఫర్ బెస్ట్ బౌలింగ్ చేయడం కంటే అరుదైన విషయమేమీ కాదుగా...’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్...

2002 వెస్టిండీస్ పర్యటనలో జరిగిన నాలుగో టెస్టులో వసీం జాఫర్ 11 ఓవర్లు బౌలింగ చేసి 18 పరుగులిచ్చి 3 మెయిడిన్ ఓవర్లతో 2 వికెట్లు తీశాడు... ఇదే మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఓ వికెట్ తీశాడు...

భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న జహీర్ ఖాన్ ఏకంగా 48 ఓవర్లు బౌలింగ్ చేసి, 14 మెయిడిన్లతో 129 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వసీం జాఫర్ బౌలింగ్ ఫిగర్స్ 18/2 కాగా, జహీర్ ఖాన్ బౌలింగ్ గణాంకాలు 129/2...

అయితే వసీం జాఫర్ ఇచ్చిన కౌంటర్‌కి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు జహీర్ ఖాన్... ‘అవును... వసీం జాఫర్ కంటే జహీర్ ఖాన్ ఓ టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎక్కువ పరుగులు చేయడం కంటే అరుదైనది ఇది..’ అంటూ పోస్టు చేశాడు జహీర్ ఖాన్..

2002 వెస్టిండీస్ పర్యటనలో జరిగిన ఐదో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వసీం జాఫర్ 15 బంతులాడి డకౌట్ అయ్యాడు. జహీర్ ఖాన్ 12 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..

రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఆడిన వసీం జాఫర్ 7 పరుగులు చేసి అవుట్ కాగా, ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ 30 బంతుల్లో 12 పరుగులు చేశాడు....

అయితే ఈ మాటల యుద్ధం అక్కడితో ఆగలేదు... జహీర్ ఖాన్ రిప్లైకి వసీం జాఫర్ తగ్గకుండా మరో రిప్లై ఇచ్చాడు. ‘వసీం జాఫర్‌కి ప్రతీ టెస్టులో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ జహీర్ ఖాన్ దాదాపు అన్ని టెస్టుల్లో బ్యాటింగ్ చేస్తాడు...’ అంటూ కన్నుకొడుతున్నట్టు ఎమోజీ జత చేశాడు జాఫర్...

click me!