భలే మజా వచ్చింది... కాన్పూర్ టెస్టు పిచ్ క్యూరేటర్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్...

First Published Nov 30, 2021, 10:13 AM IST

కాన్పూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు... టెస్టు క్రికెట్ మజాను మరోసారి పరిచయం చేసింది. పూర్తిగా ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని కోల్పోవాల్సి వచ్చింది...

ఐదో రోజు ఆఖరి సెషన్‌లో చివరి అరగంట వికెట్లకు అడ్డుగా నిలబడి, టీమిండియాకి విజయాన్ని దూరం చేశారు న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్...

భారత్‌లో జన్మించిన ఈ ఇద్దరు ప్లేయర్లు దాదాపు 9 ఓవర్ల పాటు వికెట్ కాపాడుకోవడంతో ఆఖరి వికెట్ తీయలేకపోయిన టీమిండియా... ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది...

ఐదో రోజు తొలి సెషన్‌లో వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు, రెండో సెషన్‌లో నాలుగు, ఆఖరి సెషన్‌లో మరో నాలుగు వికెట్లు తీసినా... విజయానికి అవసరమైన ఆ ఒక్క వికెట్... ఒకే ఒక్క వికెట్ తీయలేకపోయారు...

ఆఖరి అరగంటలో బంతి బంతికీ నరాల తెగే ఉత్కంఠ నడిచింది. బ్యాడ్ లైట్ కారణంగా ఆటను పొడగించలేకపోయారు ఫీల్డ్ అంపైర్లు. మొత్తానికి టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయినా... క్రికెట్ గెలిచింది...

భారత్‌లో టెస్టులు అంటే స్పిన్ పిచ్‌లను అంచనా వేస్తారు అభిమానులు. అయితే కాన్పూర్ పిచ్‌ మాత్రం పర్ఫెక్ట్ టెస్టు పిచ్‌గా, ఏ జట్టుకూ అదనపు అడ్వాంటేజ్ లేకుండా రూపొందించారు...

‘మేం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నాం. పర్ఫెక్ట్ టెస్టు పిచ్‌ తయారుచేసినందుకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, మా గ్రౌండ్‌మెన్‌కి రూ.35000 ఇచ్చారు...  ’ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)...

ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేయగా ఆరంగ్రేట టెస్టు ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు... రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా...

కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ మొదటి వికెట్‌కి 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ ఇద్దరూ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన కివీస్ 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్‌కి మూడు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

అయితే శ్రేయాస్ అయ్యర్ 65, రవిచంద్రన్ అశ్విన్ 32, వృద్ధిమాన్ సాహా 61, అక్షర్ పటేల్ 28 పరుగులు చేసి ఆరు, ఏడు, 8వ వికెట్లకు 50+ భాగస్వామ్యాలు నెలకొల్పారు...

283 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన న్యూజిలాండ్, ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 89.2 ఓవర్ల వద్ద 9వ వికెట్ కోల్పోయినా 8.4 ఓవర్ల పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసి కివీస్‌ను ఓటమి నుంచి కాపాడారు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్..

click me!