క్రీజులో టీ20 హిట్టర్లు.. ఒక్క సిక్సూ కొట్టలేదు.. సింగిల్ కోసమే తంటాలు..

First Published Jan 30, 2023, 11:52 AM IST

INDvsNZ: లక్నో వేదికగా ఆదివారం ముగిసిన భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ లో టీమిండియా అతి కష్టమ్మీద విజయం సాధించింది.  బంతి అనూహ్య మలుపులు తిరిగిన ఈ మ్యాచ్ లో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు. 

ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే,  గ్లెన్ ఫిలిప్స్,  డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్... వీళ్లంతా  న్యూజిలాండ్ జట్టు తరఫునే గాక ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్ లలో ఆడుతూ అక్కడ మెరుపులు మెరిపిస్తున్నవాళ్లే.  సిక్సర్లు కొట్టడం వీళ్లకు మంచినీళ్లు తాగినంత ఈజీ. 
 

ఇషాన్ కిషన్,  శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యాలతో పాటు  ఐసీసీ టీ20  బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో  అగ్రస్థానంలో ఉన్న  సూర్యకుమార్ యాదవ్.. వీళ్లంతా  పక్తూ టీ20 ప్లేయర్లే. టీమిండియాతో పాటు ఐపీఎల్ లో బంతులను  గ్రౌండ్ దాటించినవాళ్లే. ఒక్కో సందర్భంలో చివరి ఐదు ఓవర్లలో 80, 90 పరుగులు చేయమన్నా  చేసే సత్తా ఉంది. 

ఇంతమంది హిట్టర్లు ఉన్నా  నిన్న లక్నో వేదికగా ముగిసిన   రెండో టీ20లో ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు.  అటు కివీస్ తో పాటు ఇటు టీమిండియా ప్లేయర్కలు కూడా  సిక్సర్ కొట్టడానికి తంటాలు పడ్డారు.  సిక్సర్ల సంగతి దేవుడెరుగు కనీసం  రాకెట్ స్పీడ్ తో బంతులు బౌండరీ లైన్  దాటడానికి  అష్టకష్టాలు పడ్డాయి.  భారత్  లో ఇలా ఒక టీ20 మ్యాచ్ లో  ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం  చరిత్రలో ఇదే ప్రథమం. 

స్పిన్ కు అనుకూలిస్తున్న  లక్నో పిచ్ పై  కివీస్ తంటాలు పడితే.. భారత ఇన్నింగ్స్ అంతకంటే అధ్వాన్నంగా సాగింది.  పిచ్ ను అర్థం చేసుకున్న మిచెల్ శాంట్నర్ ఏకంగా  17 ఓవర్లు  స్పిన్నర్లతోనే వేయించాడు. ఇషాన్, త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్ లు  ఫోర్టు కొట్టడానికే తంటాలు పడ్డారు.  టెస్టుల కంటే దారుణంగా బ్యాటింగ్ చేశారు.   లక్ష్య ఛేదన సమయంలో భారత్ ఓ దశలో 8 ఓవర్ల పాటు బౌండరీ కొట్టలేదంటే  టీమిండియా ఇన్నింగ్స్ ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.  

ఈ మ్యాచ్ లో   ఇరు జట్లు కలిపి 14 బౌండరీలు మాత్రమే  సాధించాయి. కివీస్ తరఫున ఫిన్ అలెన్ ఒక్కడే రెండు బౌండరీలు కొట్టాడు. డెవాన్ కాన్వే, మిచెల్, శాంట్నర్, డఫ్ఫీ లు తలో బౌండరీ కొట్టారు. భారత్ నుంచి గిల్, ఇషాన్ లు తలా రెండు  ఫోర్లు కొట్టగా.. త్రిపాఠి, సూర్య, వాషింగ్టన్ సుందర్, హార్ధిక్ లు చెరో ఫోర్ కొట్టారు. 

ఒక టీ20 మ్యాచ్ లో ఒక్క సిక్సర్ కూడా లేకుండా ముగియడం భారత్ లో అయితే ఇదే ప్రథమం. గతంలో బంగ్లాదేశ్ - న్యూజిలాండ్ మధ్య 2021లో మీర్పూర్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగింది. అంతకుముందు ఇంగ్లాండ్ - పాకిస్తాన్ (2010లో), శ్రీలంక-ఇండియా (2021) మధ్య కూడా ఒక్క సిక్సర్  నమోదుకాని మ్యాచ్ లు ఉన్నాయి. 

click me!