India vs Sri Lanka: కొలంబో టెస్టులో శ్రీలంకపై భారత పట్టు సాధించింది. నాల్గవ రోజు వర్షం వల్ల ఆట నిలిచేసరికి శ్రీలంక 229/6 పరగలు చేసింది. 16 పరుగుల లీడ్‌లో ఆతిథ్య జట్టు నిలిచింది. దీంతో 5వ రోజు ఆటపై ఉత్కంఠ పెరుగుతోంది.
ఫాలోఆన్ విధించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 ఆలౌట్
కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఉదయం ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 290 పరుగులకే చుట్టేసింది. శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుష 162 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి పోరాడాడు. భారత బౌలర్లలో మానవ్ సుథార్ 3 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బతీశారు. దీంతో టీమిండియాకు 213 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ లభించడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శ్రీలంకకు ఫాలోఆన్ విధించాడు.
25
రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక టాప్ ఆర్డర్ పోరాటం
ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లాహిరు ఉదారను 3 పరుగులకే మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కామిల్ మిషారాను (32) రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. అయితే పసిందు సూరియబండార, కమిందు మెండిస్ కలసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పసిందు సూరియబండార 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కామిందు మెండిస్ 55 పరుగులు చేసి అతనికి మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలసి మ్యాచ్‌ను డ్రా వైపు తీసుకెళ్లేలా కనిపించారు.
35
10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి భారత్ కంబ్యాక్
శ్రీలంక జట్టు భారత లీడ్‌ను దాటేసే క్రమంలో టీమిండియా బౌలర్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కమిందు మెండిస్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్క్వేర్ లెగ్ దగ్గర రన్నింగ్ చేస్తూ అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత మానవ్ సుథార్ విజృంభించాడు. శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వాను (17) సుథార్ పెవిలియన్ పంపాడు. దాని వెంటనే సెంచరీకి చేరువలో ఉన్న పసిందు సూరియబండారను (92) కూడా అవుట్ చేసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. కేవలం 10 పరుగుల తేడాలో శ్రీలంక 3 ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది.
రెండో ఇన్నింగ్స్ 72.4 ఓవర్లు ముగిసేసరికి వర్షం ప్రారంభమైంది. మైదానంలోకి కవర్లు రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తీవ్రం కావడంతో నాలుగో రోజు ఆటను ఆపేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. క్రీజులో కేశర నువాంత (3), సోనాల్ దినుష (7) ఉన్నారు. శ్రీలంక ప్రస్తుతం భారత్ కంటే 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో మానవ్ సుథార్ 2 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలొక వికెట్ పడగొట్టారు.
55
ఐదో రోజు విజయం ఎవరిది?
నాలుగో రోజు ఆట నిలిచేసరికి శ్రీలంక 16 పరుగుల లీడ్‌లో మాత్రమే ఉంది. టీమిండియా గెలవాలంటే ఐదో రోజు మిగిలిన 4 వికెట్లను త్వరగా తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లభించే చిన్న లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేజ్ చేసే అవకాశం ఉంది. శ్రీలంక బ్యాటర్లలో గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనాల్ దినుష ఇంకా క్రీజులో ఉన్నాడు. ఐదో రోజు వాతావరణం సహకరిస్తే ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. భాారత్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.