IND vs AUS : కుప్ప‌కూలిన భార‌త్.. ఆసీస్ కు చెమ‌ట‌లు ప‌ట్టించిన బుమ్రా

First Published | Nov 22, 2024, 5:22 PM IST

IND vs AUS: పెర్త్‌లో జరిగిన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ తొలి మ్యాచ్ లో మొద‌టి రోజు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు భారత్‌ను 150 పరుగులకే కట్టడి చేశారు. ఆ త‌ర్వాత భార‌త్ కూడా అద్బుత‌మైన బౌలింగ్ తో ఆసీస్ ను దెబ్బకొట్టింది. 
 

Jasprit Bumrah

IND vs AUS: టెస్టు క్రికెట్ లో భార‌త బ్యాట‌ర్లు తేలిపోతున్నారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోతున్నారు. బ్యాటింగ్ కుప్పకూలడం ఇప్పుడు ఆనవాయితీగా మారిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 54/7తో ఆలౌటైంది. తర్వాతి రెండు టెస్టుల్లో కూడా ఈ స్లయిడ్ కొనసాగింది. దీంతో సిరీస్ కోల్పోవ‌డంతో పాటు వైట్ వాష్ అయింది. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

KL Rahul

కుప్ప‌కూలిన భారత్ టాప్ ఆర్డర్ 

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మొద‌టి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట‌ర్లు ఫ్లాప్ షో చూపించారు. తొలి రోజు మ్యాచ్‌లో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ లేకపోవడంతో అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత జట్టు ప్రదర్శన గొప్ప‌గా లేక‌పోయింది. తొలి ఇన్నింగ్స్ లో  భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి రోజు లంచ్‌కు 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

Latest Videos


Virat Kohli

ఫార్మాట్ ఏదైన స‌రే అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడే యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ మ‌రోసారి జీరో ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. అత‌నితో పాటు దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయాడు. భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ నుంచి మంచి ఇన్నింగ్స్ ను ఆశించిన ఫ‌లితం లేకుండా పోయింది. అత‌ను 26 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. గ‌త కొంత కాలంగా టెస్టు క్రికెట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌టానికి ఇబ్బంది ప‌డుతున్న భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ కూడా మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. 12 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవ‌లం 5 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు. దీంతో భార‌త్ క‌ష్టాలు మ‌రింత పెరిగాయి. 

రిష‌బ్ పంత్, నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ ల‌తో 150 కి చేరిన భార‌త్ 

కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, జైస్వాల్, ప‌డిక్క‌ల్ ఔట్ అయిన త‌ర్వాత మ‌రో యంగ్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ధ్రువ్ జురెల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక‌పోయాడు. అత‌ను 11 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. 4 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 73/6 పరుగులు చేరింది. ఇక్కడి నుంచి టీమ్‌ఇండియా 100 పరుగులకు చేరుకోవ‌డం క‌ష్ట‌మే అనిపించిన స‌మ‌యంలో రిష‌బ్ పంత్, నితీష్ లు ఇన్నింగ్స్ ను 150 ప‌రుగులకు తీసుకెళ్లారు. పంత్ 37 పరుగులు, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 8 పరుగులు, హర్షిత్ రాణా 7 పరుగుల, నితీష్ రెడ్డి 41 పరుగులు చేశారు. 

ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, హెజిల్ వుండ్ 4, ప్యాట్ క‌మ్మిన్స్ 2, మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీసుకున్నారు. 

ఆసీస్ ను ముప్పుతిప్ప‌లు పెట్టిన భార‌త బౌల‌ర్లు 

పెర్తు టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫ‌ల‌మైన భార‌త జ‌ట్టు.. బౌలింగ్ లో మాత్రం అద‌ర‌గొట్టింది. పిచ్ బౌలింగ్ కు అనుకూలించ‌డాన్ని బౌల‌ర్లు స‌ద్వినియోగం చేసుకున్నారు. మ‌రీ ముఖ్యంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్, పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మ‌రోసారి మాయ‌చేశాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఆసీస్ ను దెబ్బ‌కొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ ప‌రుగులు చేయ‌డానికి ఎలాంటి ఇబ్బంది ప‌డిందో కంగారుల టీమ్ కూడా అదే ప‌రిస్థితిని ఎదుర్కొంది. 

బుమ్రా 4 కీల‌క‌మైన‌ వికెట్లు తీసుకున్నాడు. అత‌నికి తోడుగా మ‌హ్మ‌ద్ సిరాజ్ 2 వికెట్లు, హ‌ర్షిత్ రాణా ఒక వికెట్ తీసుకున్నారు. తొలిరోజు ఆట ముగిసే స‌మయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 67 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఇంకా 83 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

click me!