INDvsAUS: కొండంత లక్ష్యం కొట్టలేకపోయారు... ఆసీస్‌దే వన్డే సిరీస్... రెండో వన్డేలోనూ ఓడిన టీమిండియా...

First Published | Nov 29, 2020, 5:18 PM IST

INDvsAUS:  390 పరుగుల కొండంత లక్ష్యం... భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చిన చోట, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియన్ బౌలింగ్ విభాగం... ఎంత బాదినా, ఎంత పోరాడినా కావాల్సిన ఫలితం మాత్రం రాలేదు. భారీ లక్ష్యచేధనలో బ్యాటింగ్‌కి దిగిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వీరోచిత పోరాటం చేసినా... టార్గెట్‌ను అందుకోలేకపోయింది. వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడి, 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. ఫలితంగా ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.

390 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకి మరోసారి శుభారంభమే అందించారు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్...
మొదటి వికెట్‌కి 58 పరుగులు జోడించిన తర్వాత శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు గబ్బర్...

ఆ తర్వాత కొద్దిసేపటికే 26 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా పెవిలియన్ చేరాడు...
60 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్... ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 93 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
36 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను హెండ్రిక్స్ అవుట్ చేశాడు. హెండ్రిక్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అయ్యర్‌ను పెవిలియన్ చేర్చాడు.
సీజన్‌లో తొలిసారి మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు...
విరాట్ కోహ్లీకి ఇది 59వ అంతర్జాతీయ వన్డే హాఫ్ సెంచరీ. కెరీర్‌లో 250వ వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లీ... 89 పరుగులతో పోరాడాడు.
ఈ దశలో 22 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసుకున్నాడు విరాట్ కోహ్లీ. 22 వేల మార్కును అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్.
సచిన్ టెండూల్కర్ తన 418 అంతర్జాతీయ మ్యాచులో (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) 21 వేల పరుగుల మైలురాయిని అందుకోగా, విరాట్ కోహ్లీ తన 418 అంతర్జాతీయ మ్యాచులో 22 వేల మైలురాయిని అందుకున్నాడు.
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ 22 వేల మైలురాయిని ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపైనే సాధించడం మరో విశేషం...
టీమిండియా తరుపున సచిన్, రాహుల్ ద్రావిడ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. అతనికంటే ముందు సచిన్, సంగర్కర, పాంటింగ్, జయవర్థనే, జాక్వస్ కలీస్, ద్రావిడ్, లారా ఉన్నారు.
సెంచరీ దిశగా అడుగులు వేస్తున్న విరాట్ కోహ్లీని మరో అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేశాడు హెండ్రిక్స్. గత మూడు మ్యాచుల్లో హజల్‌వుడ్ బౌలింగ్‌లోనే విరాట్ అవుట్ అయ్యాడు.
విరాట్ కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌కి 72 పరుగులు జోడించాడు ఈ సీజన్ వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్...
ఈ దశలో 66 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్... రోహిత్, సెహ్వాగ్ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్.
కెఎల్ రాహుల్ అవుట్ అయ్యే సమయానికే సాధించాల్సిన రన్‌రేటు భారీగా పెరిగిపోయింది. అదీకాకుండా చాలా కాలం తర్వాత బౌలింగ్ చేసిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు.
కెఎల్ రాహుల్‌ను ఆడమ్ జంపా అవుట్ చేయగా... 31 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేసినహార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో అవుట్ అయ్యారు.
రవీంద్ర జడేజా 11 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
జడేజా, పాండ్యా అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు విజయానికి 21 బంతుల్లో 67 పరుగులు కావాలి... టెయిలెండర్లు ప్రయత్నించినా ఓటమి తేడాను తగ్గించగలిగారంతే.
షమీ 1, బుమ్రా డకౌట్ కాగా సైనీ 10 పరుగులు చేయడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.. వరుసగా రెండో వన్డే గెలిచి, 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది ఆసీస్. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే బుధవారం డిసెంబర్ 2న జరగనుంది.
వరుసగా రెండు వన్డేలోనూ సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Latest Videos

click me!