విరాట్ కోహ్లీ ఏం చేస్తాడో మ‌రి?

First Published | Nov 13, 2024, 9:51 PM IST

IND vs AUS - Virat Kohli : నవంబరు 22న నుంచి భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పుడు అంద‌రి చూపు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల పైనే ఉంది.
 

IND vs AUS - Virat Kohli : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024కి ముందు భారత్ వరుసగా మూడు టెస్ట్ ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. న్యూజిలాండ్ తో జ‌రిగిన సిరీస్ లో ఘోరంగా విఫ‌ల‌మైన భార‌త స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీపై అంద‌రి దృష్టి ఉంది. గ‌త కొన్ని ఇన్నింగ్స్ లుగా విరాట్ కోహ్లీ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు. త‌న కెరీర్ లోనే చెత్త ఫామ్ లేమితో ఇబ్బంది ప‌డుతున్నాడు. అయితే, ఆస్ట్రేలియాపై 47.48 సగటుతో 2,042 పరుగుల రికార్డుతో క‌లిగిన విరాట్ కోహ్లీ.. రాబోయే సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో భారత జ‌ట్టులో అత్యంత స్థిరమైన, ప్రభావవంతమైన బ్యాటర్‌లలో ఒకరిగా ఎన్నో అద్భుత‌మైన ఇన్నింగ్స్ లో త‌న స‌త్తా ఏమిటో నిరూపించుకున్నాడు. అయితే, ఈ ఏడాది  ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024ని నవంబర్ 22న ప్రారంభించడానికి భారత జ‌ట్టు సిద్ధంగా ఉన్న త‌రుణంలో కోహ్లీ ఇటీవలి ఫామ్ భార‌త్ ను, క్రికెట్ ల‌వ‌ర్స్ ను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. 

వరుసగా 3 టెస్టుల్లో ఓడిపోయిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ ప్లేస్ కోసం రాబోయే సిరీస్ లో నాలుగు మ్యాచ్ ల‌ను గెల‌వ‌డం భార‌త్ కు చాలా కీల‌కం. అయితే, ఆస్ట్రేలియా సిరీస్‌లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంద‌ని అతని గ‌త గ‌ణాంకాలు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. 


ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ గణాంకాలు

ఆస్ట్రేలియాలో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ ల‌లో విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ల‌ను గ‌మ‌నిస్తే తరచుగా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాలనే అతని సంకల్పం క‌నిపించింది. ఆస్ట్రేలియాలో భారత జ‌ట్టు పోటీతత్వ వైఖరికి గణనీయంగా దోహదపడింది.

ఇక టెస్టు క్రికెట్ లో ఆస్ట్రేలియాతో మొత్తంగా ఆడిన 25 మ్యాచ్‌లలో  కోహ్లీ 44 సందర్భాలలో ఆస్ట్రేలియా పరిస్థితులలో వారి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 47.48 బ్యాటింగ్ సగటుతో 2,042 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై కోహ్లి స్ట్రైక్ రేట్ 52.41గా ఉంది. అత‌ను 3,896 బంతులు ఎదుర్కొన్నాడు. 

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై కోహ్లీ అత్యధిక స్కోరు 186 ప‌రుగులు. మార్చి 2023లో సాధించాడు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ జ‌ర‌గ్గా.. ఈ టెస్టు డ్రా అయింది. కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా జ‌ట్టుపై  కోహ్లీ అత్యధిక స్కోరు 272 బంతుల్లో 169 ప‌రుగులు. 2014లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సాధించాడు. 2018లో ఆస్ట్రేలియా డౌన్‌ అండర్‌పై కోహ్లీ చివరి సెంచరీ సాధించాడు. పెర్త్ టెస్టు మ్యాచ్‌లో 257 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 35.14 సగటుతో 7 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 246 పరుగులు చేశాడు.

2024లో విరాట్ కోహ్లీ టెస్టు గణాంకాలు

జనవరి 2024లో కోహ్లి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను ఆడాడు. కేప్ టౌన్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని స్కోర్లు 46 (59 బంతుల్లో), 12 (11 బంతుల్లో). మొదటి ఇన్నింగ్స్‌లో 77.96 స్ట్రైక్ రేట్ ఉండగా, రెండో ఇన్నింగ్స్‌లో 109.09గా ఉంది. 

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ లో ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు. చెన్నైలో అతను తన రెండు ఇన్నింగ్స్‌లలో 6, 17 ప‌రుగుల‌ తక్కువ స్కోర్లు చేశాడు. అయితే, అతను అదే నెలలో కాన్పూర్‌లో తిరిగి పుంజుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134.28 స్ట్రైకింగ్ రేట్‌తో 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను ఆడాడు. అక్కడ కోహ్లీ ఫామ్‌లో హెచ్చుతగ్గులు క‌నిపించాయి. బెంగళూరులో మొదటి ఇన్నింగ్స్‌లో 0 స్కోర్ చేశాడు, అయితే రెండో ఇన్నింగ్స్‌లో 102 బంతుల్లో 70 పరుగులు చేశాడు. పూణెలో, రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 1, 17 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఆ త‌ర్వాత వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు కూడా 4, 1 స్కోర్‌లతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. 

మొత్తంగా 2024లో కోహ్లీ 12 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడి 20.09 సగటుతో 221 పరుగులు చేశాడు. 5 సందర్భాలలో అతను సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు. అతని అత్యధిక స్కోరు 70 మినహా ఈ ఏడాది 50 పరుగుల మార్కును ఒక్క‌సారి కూడా దాటలేదు. మ‌రీ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఏం చేస్తాడో  చూడాలి మ‌రి. 

Latest Videos

click me!