ఇన్ని మ్యాచులాడినా నువ్వు హాఫ్ సెంచరీ చేయలేదు.. మళ్లీ రెస్ట్ ఎందుకు..? హిట్ మ్యాన్ ను కడిగిపారేసిన కపిల్ దేవ్

First Published Jun 24, 2022, 4:14 PM IST

Kapil Dev Slams Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ పై దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు. ఐపీఎల్-15 మొత్తం సీజన్ ఆడినా హాఫ్ సెంచరీ కూడా చేయలేనివాడికి రెస్ట్ ఎందుకని.. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15తో పాటు  అంతకుముందు టీమిండియా మ్యాచులలో కూడా పెద్దగా ఆకట్టుకోని  భారత జట్టు సారథి రోహిత్ శర్మపై భారత్ కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్  దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా విఫలమవుతున్నా అతడికి రెస్ట్ ఎందుకిచ్చారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు. 

రోహిత్ శర్మ ఫామ్ లేమి గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఎవరికి విరామం ఇస్తున్నారో..? ఎందుకిస్తున్నారో అనేదానిమీద తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది.  సెలక్టర్లకు మాత్రమే ఈ విషయంమీద అవగాహన ఉండి తీరాలి. 

రోహిత్ శర్మ అద్భుతమైన క్రికెటర్. అందులో సందేహమేమీ లేదు. కానీ గత 14 మ్యాచులలో (ఐపీఎల్ లో)  నువ్వు హాఫ్ సెంచరీ కూడా చేయలేదంటే నిన్ను ప్రశ్నించాల్సిందే కదా. అది గ్యారీ సోబర్స్ అయినా, డాన్ బ్రాడ్మన్, విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్,  సునీల్ గవాస్కర్, వివ్ రిచర్డ్స్ అయినా సరే. ప్రశ్నించాల్సిందే. 

నాకు తెలిసి ఈ ప్రశ్నకు రోహిత్ ఒక్కడే సమాధానం చెప్పగలడు.  మితి మీరిన క్రికెట్ వల్ల అతడు అలా ఆడుతున్నాడా..? లేక అతడు క్రికెట్ ను ఆస్వాదించడం మానేశాడా..? అనేది తెలిపేది అతడొక్కడే..’ అని అన్నాడు. 

రోహిత్, విరాట్ వంటి గొప్ప ఆటగాళ్లు ఆటను ఆస్వాదించాలని లేకుంటే ఫామ్ లేమి  దీర్ఘకాలం కొనసాగి జట్టులో వారి స్థానానికే ఎసరు రావొచ్చని కపిల్  హెచ్చరించాడు. ‘రోహిత్, విరాట్ వంటి ఆటగాళ్లు వారి ఆటను ఆస్వాదించాలి.  వారి ప్రదర్శనల పట్ల వాళ్లేమనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. 

ఫామ్ ను తిరిగి పొందడానికి మీరు రన్స్ చేయాలి. మీకున్న పేరు, ప్రఖ్యాతుల కారణంగా క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగలేరనే సత్యాన్ని మీరు గ్రహించాలి. మీరు ఇదే ఆటను కొనసాగిస్తే మీకు కూడా అవకాశాలు తగ్గిపోతాయి. 14 మ్యాచుల తర్వాత కూడా ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదంటే నీకు ఇంకా ఎన్ని మ్యాచులు అవసరమవుతాయి..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

కాగా ఐపీఎల్-15లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ.. 14 మ్యాచులలో 268 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. ఆ తర్వాత అతడికి స్వదేశంలో ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్ లో విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. 

click me!