కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టడానికి అదే కారణం... ఐపీఎల్‌లాగ ఆ రూల్ ఉండి ఉంటేనా! - కెఎల్ రాహుల్...

First Published Dec 25, 2022, 5:03 PM IST

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు తీసి బ్యాటుతో 40 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు కుల్దీప్ యాదవ్. అయితే రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్‌లో కుల్దీప్ యాదవ్ లేకుండా బరిలో దిగింది భారత జట్టు..

Kuldeep Yadav

వీసా రావడం ఆలస్యం కావడంతో తొలి టెస్టు ఆడే అవకాశాన్ని కోల్పోయిన జయ్‌దేవ్ ఉనద్కట్‌ని తుది జట్టులోకి తేవడానికి కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టేసింది టీమిండియా. స్పిన్‌కి అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా తీసుకున్న ఈ నిర్ణయం పెద్దగా కలిసి రాలేదు...

జయ్‌దేవ్ ఉనద్కట్‌ బాగానే ఆకట్టుకున్నా, భారత జట్టులో కుల్దీప్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా టీమిండియాపై రెండు ఇన్నింగ్స్‌లో 200+ పరుగులు చేసింది బంగ్లాదేశ్. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ల నుంచి ఆశించినంత వేగంగా వికెట్లు రాలేదు...
 

Kuldeep Yadav

రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ నిలబడి టీమిండియాకి విజయాన్ని అందించబట్టి సరిపోయింది కానీ.... లేదంటే 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా... బంగ్లాదేశ్ చేతుల్లో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చేది. అప్పుడు కుల్దీప్ యాదవ్ గురించి చాలా పెద్ద చర్చ జరిగి ఉండేది...

‘ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకువచ్చారు. అది టెస్టుల్లో కూడా ఉండి ఉంటే బాగుండు. అప్పుడు కుల్దీప్ యాదవ్‌ని రెండో ఇన్నింగ్స్‌లో జట్టులోకి తీసుకొచ్చేవాడిని. తొలి టెస్టు గెలిచిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టడం చాలా కఠినమైన నిర్ణయం... కానీ తప్పలేదు...

kuldeep

తొలి రోజు పిచ్ చూసిన తర్వాత ఫాస్ట్ బౌలర్లకు కూడా అనుకూలిస్తుందని అనుకున్నాం. అందుకే ఎక్స్‌ట్రా స్పిన్నర్ కంటే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఆడితే బెటర్ అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే కుల్దీప్‌ యాదవ్‌ని పక్కనబెట్టాల్సి వచ్చింది. ఆ నిర్ణయం తప్పని నేను అనుకోవడం లేదు...

ఫాస్ట్ బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేశారు.నిలకడగా రాణించే ప్లేయర్లు దొరకడం ఏ టీమ్‌కైనా అదృష్టమే. శ్రేయాస్ అయ్యర్ చాలా ఏళ్లుగా టీమ్‌లో ఉన్నాడు. తనకి దక్కిన అవకాశాలకు న్యాయం చేస్తున్నాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్...
 

KL Rahul

ఈ ఏడాది ఆరంభంలో టెస్టు కెప్టెన్‌గా జోహన్‌బర్గ్ టెస్టు ఆడి ఘోర పరాభవాన్ని అందుకున్న కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్ టూర్‌లో 2-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింకా రహానే తర్వాత విదేశాల్లో టెస్టు, టీ20, వన్డే సిరీస్ గెలిచిన భారత కెప్టెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్.. 

click me!