T20 World Cup: వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు కివీస్ కు భారీ షాక్.. ఆ ఆటగాడికి గాయం.. టోర్నీ నుంచి ఔట్

First Published Nov 12, 2021, 1:21 PM IST

Devon Conway:  అంచనాల్లేకుండా ప్రపంచకప్ లో అడుగుపెట్టి ఇప్పుడు తుది మెట్టు మీద ఉన్న న్యూజిలాండ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టులో ఉన్న కీలక ఆటగాడికి చేతి గాయం కావడంతో టోర్నీ నుంచి  నిష్క్రమించాడు.

మరో రెండ్రోజుల్లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరుగనుండగా.. అంతలోపే న్యూజిలాండ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్స్ కు చేరిన కివీస్ కు ఇది నిబంగా భారీ షాకే. ఆదివారం ఆ జట్టు.. తన చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనున్నది.

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే.. గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బుధవారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అతడి చేతికి గాయమైంది.

ఈ సిరీస్ లో నిలకడగా రాణిస్తున్న కాన్వే.. ఫైనల్స్ తో పాటు నవంబర్ 17 నుంచి ఇండియాతో జరిగే టీ20 సిరీస్ కు కూడా అందుబాటులో ఉండడని ఆ జట్టు  హెడ్ కోచ్ గారీ స్టెడ్ తెలిపాడు. 

ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో కాన్వే.. కివీస్ ను ఆదుకున్నాడు. 167 పరుగుల లక్ష్య ఛేదనలో గప్తిల్, విలియమ్సన్ త్వరగానే ఔటవడంతో ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో ఓపెనర్ మిచెల్ కు జతకలిసిన కాన్వే.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

ఈ  మ్యాచ్ లో సంయమనంతో ఆడిన కాన్వే.. 46 పరుగులు చేశాడు. అనంతరం మిచెల్.. జేమ్స్ నీషమ్ సాయంతో మిగతా పనిని పూర్తి చేశాడు. కాగా, ఇంగ్లాండ్ తో  బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాన్వే చేతికి గాయమైందని కోచ్ స్టెడ్ తెలిపాడు. 

ఇదే విషయమై స్టెడ్ స్పందిస్తూ.. ‘కాన్వే చేతికి గాయమవడంతో అతడు ఆసీస్ తో జరిగే ఫైనల్స్ కు అందుబాటులో ఉండడు. కాన్వే ఎప్పుడూ బ్లాక్ క్యాప్స్ (న్యూజిలాండ్) తరఫున ఆడటాన్ని గౌరవంగా భావిస్తాడు. కానీ ఫైనల్స్ కు ముందు ఇలా జరుగడం అతడిని ఎక్కువ బాధించి ఉంటుంది’ అని అన్నాడు.

ఈ గాయం కారణంగా అతడు ఫైనల్స్ తో పాటు టీమిండియా  సిరీస్ కు కూడా దూరమయ్యాడు. దీంతో  కీపర్ స్థానాన్ని టిమ్ సీఫర్ట్ భర్తీ చేయనున్నాడు. అయితే నవంబర్ 25 నుంచి భారత్ తో మొదలయ్యే టెస్టు సిరీస్ కు మాత్రం కాన్వే అందుబాటులో ఉండే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

ఇదిలాఉండగా.. వచ్చే ఆదివారం న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరుగనుంది. టీ20 ప్రపంచకప్ లో ఫైనల్స్ కు చేరడం ఆసీస్ కు ఇది రెండో సారి కాగా.. న్యూజిలాండ్ కు మాత్రం ఇదే తొలిసారి. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు.. తొలి  మ్యాచ్ లో ఓడినా.. తర్వాత గొప్పగా పుంజుకుంది.  సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్స్ లో ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా చరిత్రే.  ఆదివారం ప్రపంచం కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నది. 

click me!